PM Narendra Modi Telangana Tour : రాష్ట్రంలో నవంబరు లేదా డిసెంబరు నెలాఖరు శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. జులై 8న వరంగల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న మోదీ పర్యటన ఎట్టకేలకు ఫైనల్ కావడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. జులై 8న నిర్వహించే పర్యటనలో వరంగల్లోని కాజీపేట వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కుగా పేరు పొందనున్న వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన.. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
PM Modi Public Meeting In Hanumakonda on July : రాష్ట్రంలో కేసీఆర్ను గద్దె దించాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్న.. బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజానికానికి చూపిస్తూ.. ఓటర్లను ఆకర్షించే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ వస్తోంది. మహా జన్ సంపర్క్ అభియాన్లో భాగంగా.. ఈ నెలలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొనవలసింది. కర్ణాటక తరహాలోనే అత్యధిక రోడ్ షోలు నిర్వహించి.. ప్రజల వద్దకే బీజేపీని తీసుకువెళ్లాలని చూశారు. ఈ రోడ్ షోలోనే హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు కానీ.. విదేశీ పర్యటనల వల్ల మోదీ ఈ సమావేశాలను వాయిదా వేశారు. తాజాగా మోదీ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ఇటీవలి కర్నాటక ఫలితాలతో రాష్ట్ర బీజేపీలో కాస్త నైరాశ్యం నెలకొని ఉంది. ఇప్పుడు మోదీ పర్యటనతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వస్తుందని అగ్రనేతలు భావిస్తున్నారు. రాష్ట్ర పర్యటనలో మోదీ స్థానిక నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశముంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని కృత నిశ్చయంతో ఉన్న బీజేపీ హైకమాండ్.. అందుకు తగ్గట్లుగానే మోదీ పర్యటనను ప్లాన్ చేసింది.
బీజేపీ నాయకుల కీలక సమావేశం వాయిదా : మరోవైపు మోదీ పర్యటన నేపథ్యంలో జులై 8న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో నిర్వహించే సమావేశాన్ని పార్టీ అధిష్ఠానం వాయిదా వేసింది. హైదరాబాద్లో జేపీ నడ్డా అధ్యక్షతన ఈ భేటీ జరగాల్సి ఉంది. త్వరలోనే ఈ సమావేశానికి సంబంధించిన కొత్త తేదీని ప్రకటించనున్నారు.
ఇవీ చదవండి :