కన్నతల్లి క్యాన్సర్ చికిత్సకు డబ్బుల్లేక విధిలేని పరిస్థితుల్లో ఓ పదకొండేళ్ల బాలిక.. తాను అంగడిసరకుగా మారడానికి సిద్ధమైంది. ఐదువేల రూపాయలకు తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. హృదయవిదారకమైన ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.
అదృష్టవశాత్తూ బాలిక ఆ రొంపిలోకి దిగకముందే పోలీసులు ఆమెను రక్షించారు. చిన్నారిని ఒత్తిడి చేసి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమైన ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. ఆమె కోసం రూ.40వేలు చెల్లించడానికి సిద్ధమైన విటుడే బాలిక దీనగాథకు చలించి ఇన్‌ఫార్మర్‌గా మారాడు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లి కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. పేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి అవసరాన్ని పొరుగున ఉండే అర్చనా వైశంపాయన్ (39) పసిగట్టింది. మాయమాటలు చెప్పి బాలిక కన్యత్వానికి రూ.5వేలు వెల కట్టేలా ఒప్పించి, తనతో పంపమంది. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి ఒప్పుకుంది.
అర్చనతోపాటు రంజనా మెష్రామ్ (45), కవితా నిఖారే (30)లు ఓ వ్యక్తితో రూ.40వేలకు బేరం కుదిర్చారు. కానీ బాలికను 'కొనుగోలు' చేసిన విటుడే జాలిపడి ఓ స్వచ్ఛంద సంస్థకు ఉప్పందించాడు. ఆ సంస్థ సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్‌ఎస్‌బీ) పోలీసులకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు.
ఇదీ చదవండి: 'మీ నాన్న దగ్గరకు తీసుకెళ్తా'... ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య