Minister Usha Sri Charan: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఉషశ్రీ చరణ డబ్బులు పంపిన విషయంలో లెక్కలు సరిచూస్తున్న వీడియోను టీడీపీ నేతలు విడుదల చేశారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, అమర్నాథ్ రెడ్డిలు ఆ వీడియోను విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవటానికి దొంగ ఓట్లను సృష్టించడం, ఉన్న ఓట్లను డబ్బుతో కొనేయడం వంటి మార్గాలను వైసీపీ ఎంచుకుందని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. మంత్రి ఉషాశ్రీ చరణ్ అడ్డం గా దొరికిపోవడం విచారకరమని ఎద్దేవా చేశారు. మంత్రి ఉషశ్రీకి లెక్కలు అన్నీ పెర్ఫెక్ట్ గా ఉండాలని, లేకపోతే ఆడిటింగ్ లో పట్టేస్తారని, వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని అమర్నాథ్ రెడ్డి విమర్శించారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా మంత్రులే డబ్బుల పంపిణీకి దిగడం దారుణమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఓటర్లకు పంచిన డబ్బుల పంపిణీ లెక్కలు చూస్తూ మంత్రి ఉషశ్రీ చరణ్ అడ్డంగా దొరికిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఉషశ్రీ చరణను మంత్రివర్గం నుంచి గవర్నర్ వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు: ఎన్నికల్లో వైసీపీకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, వాలంటీర్లు డబ్బులు, మందు విచ్చలవిడిగా పంపిణీ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. యువతను తప్పుదోవ పట్టించే పనిలో వైసీపీ ఉందని ధ్వజమెత్తారు. డిగ్రీ లేనివారిని కూడా ఓటరుగా నమోదు చేసి, బోగస్ ఓట్లు చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఓటుకు 10 వేలకు పైగా పంచుతున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని నిలదీశారు. ఎన్నికల కమిషన్ రాజ్యంగ విలువలను కాపాడాలని సూచించారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
సీపీఐ మంత్రి ఉషశ్రీ చరణకు వ్యతిరేకంగా.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీ కూడలిలో సీపీఐ నాయకులు మంత్రి ఉష శ్రీ చరణ్ ను వెంటనే భర్త చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఇదే అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్న ఉషశ్రీ చరణ్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అధికార వైసీపీ దొంగ ఓట్లు, నోట్ల కట్టల ద్వారా లబ్ది పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియోలు మంత్రి డబ్బులు పంచిన వివరాలు అడుగుతున్నట్లు కనిపిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కరికి రూ. 20వేల వరకు పంచిన వాటి వివరాలపై ఆరా తీస్తున్నట్లు వీడియోలో ఉంది.
ఇవీ చదవండి: