దీపావళి రోజున 30 ఏళ్ల దళిత యువకుడిని దారుణంగా హత్య చేసి, అతడి కళ్లు పీకేశారు కొందరు దుండగులు. ఇది కచ్చితంగా ఓ వర్గానికి చెందిన వారి పనే అని మృతుని తల్లి ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ హత్యలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల హస్తం ఉందని బాధితుడి తల్లి చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. దీపావళి రోజు రాత్రి బృజ్పాల్ అనే దళిత యువకుడిని సోనూ, సచిన్ అనే ఇద్దరు యువకులు బయటకు రమ్మని పిలిచారు. వాళ్లతో బయటకు వెళ్లిన యువకుడు ఎంతకీ రాకపోయేకరికి గ్రామస్థులు అతని కోసం గాలించారు. అయితే మరుసటి రోజు ఓ రైతు ఇంటి వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహం లభ్యమైంది. భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన దళిత సంఘాలు.. మృతుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఇంచౌలీ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన నిరసనకారులకు పోలీసులు నచ్చజెప్పి పంపిచారు. తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య
మధ్యప్రదేశ్ దామోహ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ దళిత కుటంబానికి చెందిన ముగ్గురిని కాల్చి చంపారు. అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులతో వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన వారిలో 60 ఏళ్ల వృద్ధుడితో పాటు అతని భార్య, కుమారుడు ఉన్నారని పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం 6:30 గంటలకు జరిగిన ఈ ఘటనలో దంపతులకు చెందిన మరో ఇద్దరు కుమారులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరిని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పాత కక్షలకు ఒకరు బలి
రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇందోర్‌లో జరిగింది. ఆ కుటుంబాల మధ్య గత కొంత కాలంగా శత్రుత్వం ఉందని, తరచూ వాగ్వాదాలకు దిగుతుండేవారని పోలీసుల విచారణలో తేలింది.
సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బడి గ్వాల్తోలి ప్రాంతంలో నివాసముంటున్న ఇరు కుటుంబాల మధ్య పాత కక్షల కారణంగా గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు.. మరో కుటుంబంపై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. ఇందులో ఐదుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆగ్రహించిన మృతుడి బంధువులు.. మరో కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. దీంతో మరో నలుగురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఇరు కుటుంబాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆస్పత్రితో పాటు బడి గ్వాల్తోలి ప్రాంతంలోనూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
అత్యాచార బాధితురాలి హత్యకు యత్నం
బిహార్ బస్తీలోని ఓ ఆశ్రమానికి వచ్చిన అత్యాచార బాధితురాలైన సాధ్విని హత్య చేసేందుకు యత్నించాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో మరికొందరు ఆమె కారును ధ్వంసం చేసి డ్రైవర్‌ను చితకబాదారు. అయితే నిందితుడిని బిహార్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కల్పనాథ్ చౌదరిగా గుర్తించారు పోలీసులు. అతడి కోసం బిహార్ పోలీసులు గత నాలుగేళ్లుగా గాలిస్తున్నట్లు సమాచారం.
సాధ్విపై దాడికి సంబందించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కల్పనాథ్‌తో సహా అతని ఇద్దరు సోదరుల కోసం వెతుకుతున్నారు. అయితే ఆశ్రమంలోకి బలవంతంగా ప్రవేశించిన నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు సాధ్వి ఆరోపించారు. అతనిపై నెవాడా జిల్లాలోని గోవింద్‌పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఘటనా లాల్గంజ్ పరిధిలో ఉన్నందున పోలీసులు ఆ ప్రాంతంలో కేసు నమోదు చేయాలని సూచించారు. తర్వాత ఏఎస్పీ ఆదేశాలతో లాల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్ణాటకలో మఠాధిపతి ఆత్మహత్య
కర్ణాటకలోని కుంచాగల్బందేలోని ఓ మఠానికి చెందిన అధిపతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహం వద్ద పోలీసులకు రెండు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ఆయన్ను ఎవరో బెదిరింపులకు గురిచేసి వేధించినట్లు ఉందని.. అలాగే మృతికి కారణమైన వారి పేర్లను సైతం అందులో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సుమారు 400 ఏళ్ల చరిత్ర గల కెంపపురా మఠానికి 1997లో మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు బసవలింగేశ్వర స్వామి. ఆయన కొన్ని నెలల క్రితం ప్రధాన అర్చకుడిగా రజతోత్సవాలు జరుపుకున్నారని ఆలయ సిబ్బంది తెలిపారు. ఉదయం ఆరు గంటల దాటినా స్వామి బయటకు రాకపోయేసరికి ఆందోళన చెందిన సిబ్బంది.. గది వెనక్కి వెళ్లి చూడగా ఆయన ఉరి వేసుకుని కనిపించారు. షాక్‌కు గురైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే నోట్లో ఉన్న పేర్లను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. మఠంతో పాటు స్వామి పరిచయస్థులు కొందరిని విచారించనున్నామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాత స్వామి అంతిమ సంస్కారాలు నిర్వహించామని సిబ్బంది తెలిపారు. ఇదే తరహాలో గతేడాది డిసెంబర్లో చిలుమి మఠాధిపతి బసవ లింగ స్వామి కూడా మృతి చెందారు.
ఇదీ చదవండి: 'ఆ పేలుడు వెనక ఉగ్రహస్తం.. నిందితులకు ఐసిస్‌తో లింకులు.. విదేశాల నుంచి ప్లాన్'