దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండొద్దన్న ప్రచారం హోరెత్తుతున్న వేళ, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసు దేవ్.. తమిళనాడు సీఎం పళని స్వామికి, ప్రతిపక్షనేత స్టాలిన్‌కు లేఖ రాశారు. ఎన్నికల మేనిఫెస్టోలో దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ తొలగిస్తామని పేర్కొనాలని కోరారు. ఈ లేఖను జగ్గీవాసుదేవ్ తరపున ఆయన అనుచరులు స్టాలిన్‌కు, పళని స్వామికి అందించారు.
"ప్రజల అభీష్టాల్ని తీర్చండి. దేవాలయాల నుంచి ప్రభుత్వ నియంత్రణను తొలగించాలని వారు ఉద్యమిస్తున్నారు. వారి కోర్కెలకు అనుగుణంగా దేవాలయాలపై నియంత్రణ తొలగిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనండి."
-జగ్గీవాసు దేవ్, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు
దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల వాటి పవిత్రత దెబ్బతింటోందని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన హిందూ రిలీజియన్ అండ్ ఛారిటబుల్ ఎండోన్మెంట్ యాక్ట్-1959 అత్యధిక సంఖ్యాక వర్గమైన హిందూవుల దేవాలయాల పవిత్రతను, ప్రాధాన్యాన్ని నాశనం చేసిందని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన మతపరమైన స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగిస్తోందని అన్నారు. రాజ్యంగంలోని లౌకికభావనకు ఈ చట్టం తూట్లు పొడుస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: వర్చువల్‌గానే 'ఈశా' ఫౌండేషన్ శివరాత్రి వేడుకలు