దేశంలో రెండో దశ కరోనా విజృంభణ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తమ నిరసనలను వాయిదా వేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ప్రస్తుతం ఆందోళనలో ఉన్న రైతులంతా కరోనా నిబంధనలను తప్పక అనుసరించాలన్నారు. కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా దిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొంటున్న రైతుల పిల్లలు, వారికి సంబంధించిన వృద్ధులను ఇళ్లకు పంపించేయాలని రైతు సంఘాల ప్రతినిధులను గతంలో అనేకసార్లు కోరినట్లు తోమర్ గుర్తుచేశారు. నిరసనలను వాయిదా వేసి చర్చలకు రావాలని పునరుద్ఘటించారు.
కొందరి వల్లే..!
దేశంలోని అనేక రైతు సంఘాలతో పాటు.. ఆర్థికవేత్తలు వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇస్తున్నారని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. అయితే కొందరు రైతులు మాత్రమే వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. నిరసన తెలిపిన రైతు సంఘాలతో ప్రభుత్వం 11 దఫాలు చర్చలు జరిపిందని గుర్తు చేశారు. మరిన్ని చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
''సాగు చట్టాల్లో రైతులకు సమస్యాత్మకంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు, వాటిలో మార్పులు చేసేందుకు మేము ముందుకొచ్చాం. కానీ రైతు సంఘాలు అందుకు అంగీకరించలేదు. సరైన కారణమూ చెప్పలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేనప్పుడు, రైతు సంఘాలకు అనుకూల నిర్ణయాలు వెలువడని సందర్భంలో.. ఆందోళనలు కొనసాగించొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఈ ఆందోళనలను ఎలాగైనా కొనసాగించాలని రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి.''
-నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి
ఇవీ చదవండి: ఎక్స్ప్రెస్ వే దిగ్బంధంతో రైతుల నిరసన