ఇట్టే జారిపోయే రాగి గింజలను చేతితో పట్టుకోవడమే చాలా కష్టం. అలాంటిది కర్ణాటకలోని మండ్యకు చెందిన సచిన్ అనే యువకుడు కిలో రాగి గింజలను ఒక్కొక్కటిగా లెక్కించారు. ఓర్పు, సహనంతో కూడుకున్న ఈ పని చేయడానికి అతను ఎంతగానో కష్టపడ్డారు. ఈ శ్రమను గుర్తించిన అధికారులు యువకుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించారు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..
తాను చేసిన ఈ పనిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులకు వర్చువల్‌గా వివరించారు సచిన్. రాగి గింజలను లెక్కపెట్టే సమయంలో తాను తీసుకున్న జాగ్రత్తలను తెలిపారు. సావధానంగా విన్న వారు రికార్డుకు అర్హుడిగా తేల్చారు. మెడల్‌ను, ధ్రువపత్రాన్ని కొరియర్ ద్వారా ఇంటికి పంపారు.
"ఎవరో బియ్యాన్ని లెక్కించారు అనే వార్తను చూశాను. నాకు అప్పుడే రాగి ఎందుకు లెక్కించకూడదు అనే అలోచన వచ్చింది. ఇందుకు సంబంధించిన వాటి గురించి ఇంటర్నెట్లో వెతికాను. దొరికిన సమాచారం మేరకు రాగి గింజలను లెక్కించడం మొదలు పెట్టాను. ప్రతి 500 గింజలను ఓ ప్యాకెట్‌గా తీసుకున్నాను. మొత్తం 752 ప్యాకెట్లు అయ్యాయి. నేను లెక్కపెట్టిన విధానం గురించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అధికారులు అడిగారు. వారికి వివరించాను. చివరగా ధ్రువీకరించారు."
-సచిన్
146 గంటల 30 నిమిషాలు
మొత్తం కిలోకు 3,76,083 రాగి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు సచిన్. వీటిని లెక్కపెట్టడానికి 146 గంటల 30 నిమిషాల సమయం తీసుకున్నట్లు తెలిపారు.
రికార్డుతో సంతృప్తి...
సచిన్ స్వస్థలం కర్ణాటకలోని మండ్య. అయితే ఆ యువకుడు ప్రస్తుతం శివమొగ్గలో బీకాం చదువుతున్నారు. మొదట మెకానికల్ ఇంజినీరింగ్‌లో చేరిన సచిన్.. మధ్యలోనే ఆపేసి డిగ్రీలో చేరడంపై కుటుంబ సభ్యులు కొంత నిరాశకు గురి అయ్యారు. అయితే ప్రస్తుతం అతను సాధించిన రికార్డు పట్ల వారు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.