ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. 22 ఏళ్లు కుటుంబానికి దురమయ్యాడు. భార్యాపిల్లలు తన కోసం ఎదురుచూస్తున్నారని తెలియక.. ఒక చోటు నుంచి మరొక చోటుకు తిరిగుతూనే ఉన్నాడు. జ్ఞాపక శక్తి కోల్పోయి.. తన సొంత ఊరును చేరుకోలేక పోయాడు. చివరకు 22 ఏళ్ల తర్వాత అతడి తలరాత మారింది. విధి అతడిని తన కుటుంబం వద్దకు చేర్చింది. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి గాథ ఇది.
దర్భంగా జిల్లా బిచ్చౌలి గ్రామానికి చెందిన వ్యక్తి రమాకాంత్ ఝా. తన కుటుంబానికి మెరుగైన జీవితం అందిచాలని కలలు కన్నాడు. కానీ తాను ఉన్న చోట ఏ పని దొరకలేదు. దీంతో తన భార్య, మూడేళ్ల కుమారుడిని ఇంట్లో వదిలేసి.. ఉపాధి కోసం హరియాణాకు రైలులో పయనమయ్యాడు. హరియాణాలోని అంబాలా స్టేషన్లో రైలు ఆగింది. వాటర్ బాటిల్ కొనడానికి దిగిన రమాకాంత్ మళ్లీ ట్రైన్ ఎక్కలేకపోయాడు. అతడు ఎక్కేలోపే రైలు వెళ్లిపోయింది. దీంతో ఇంటికి ఎలా వెళ్లాలో రమాకాంత్‌కు తోచలేదు. అలా క్రమంగా ఆకలి, దప్పిక అతడి మానసిక పరిస్థితిని మరింత దిగజార్చాయి.
ఇదిలా ఉంటే, రమాకాంత్.. ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో అతడి కుటుంబ సభ్యులు వెతుకుతూనే ఉన్నారు. తప్పిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కానీ, అతడి ఆచూకీ తెలియలేదు. అయినా అతడి భార్య, కుమారుడు ఆశలు వదులుకోకుండా రమాకాంత్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
కర్నాల్‌లో ఉండే ఆశియానా అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రాజ్‌కుమార్ అరోరా.. ఓ రోజు నగరంలోని షుగర్ మిల్ వద్ద ఓ వ్యక్తిని చూశారు. రమాకాంత్ తప్పిపోయిన విషయంపై అవగాహన ఉన్న రాజ్‌కుమార్.. ఆ వ్యక్తిని నిశితంగా పరిశీలించి చూశారు. అతడి గురించి స్థానికులను ఆరా తీశారు. అతడు నెల రోజులుగా అక్కడే కూర్చుంటున్నాడని.. ఎవరైనా ఏదైనా ఇస్తే తింటాడని.. లేదా ఆకలితో ఉండిపోతాడని స్థానికులు ఆయనతో చెప్పారు.
దీంతో రమాకాంత్‌ను తన ఇంటికి తీసుకెళ్లి.. మంచి ఆహారం, వైద్యం అందించాడు రాజ్‌కుమార్. దాదాపు రెండు నెలల తర్వాత రమాకాంత్ మానసిక స్థితి మెరుగుపడి.. తన సొంత ఊరు, భార్యాపిల్లలు గురించి విషయాలు గుర్తుకొచ్చాయి. ఆ విషయాలన్నీ రాజ్‌కుమార్‌కు చెప్పాడు. దీంతో రాజ్‌కుమార్ బిహార్‌లోని దర్భంగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి జరిగింది వివరించాడు. అనంతరం రాజ్‌కుమార్ సాయంతో 22 ఏళ్ల తర్వాత బుధవారం తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మూడేళ్ల బాలుడిగా ఉన్న తన కుమారుడిని ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న యువకుడిగా చూసి భావోద్వేగానికి గురయ్యాడు.
ఇవీ చదవండి :