తమిళనాడు తిరువణ్నామలైలోని దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య వల్లి సహా నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని కొడవలితో నరికాడు. ఈ దాడిలో నిందితుడి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు మరణించారు. మరో కుమార్తె భూమిక తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వారిపై దాడి అనంతరం నిందితుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని పళనిగా పోలీసులు గుర్తించారు.
మృతులను వల్లి, సౌందర్య, త్రిష, మోనిషా, తనుశ్రీ, శివశక్తిగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యలే ఈ హత్యలకు కారణమని తెలుస్తోంది. కూలీ పని చేసే నిందితుడు పళని.. మద్యానికి బానిసై తరచుగా కుటుంబ సభ్యులతో గొడవపడేవాడని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై తిరువణ్నామలై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవజాత శిశువును మొదటి అంతస్తుపై నుంచి..
గుజరాత్ సూరత్‌లో అమానవీయ ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలిక.. శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రి భవనం మొదటి అంతస్తు నుంచి ఆమెను కిందకి విసిరేసింది. ఈ క్రమంలో చిన్నారి మృతి చెందింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. గర్భం దాల్చేందుకు కారణమైన యువకుడి(20)పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ సూసైడ్..
బంగాల్ సిలిగుడిలోని బాగ్డోగ్రా ఎయిర్‌ఫోర్స్ క్యాంపులో దారుణం జరిగింది. ఓ ఎయిర్‌ఫోర్స్ అధికారి తన సర్వీస్ గన్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సుర్జిత్ మెహ్రా(37)గా పోలీసులు గుర్తించారు. ఆయన స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని చమేలీ అని తెలిపారు. సోమవారం జరిగిందీ ఘటన.
బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు..
ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులే నవజాతశిశువును రూ.లక్షకు అమ్మేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.82 వేలు స్వాధీనం చేసుకున్నారు. తన భార్య ప్రసవించిన వెంటనే నవజాతశిశువును నిందితుడు ఓ జంటకు అప్పగించాడు. ఆ సమయంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.