నకిలీ పేర్లు, వివరాలతో ముగ్గురు మహిళలను మోసగించి వివాహం చేసుకున్న ఓ వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహమ్మద్ అబిద్ అలియాస్ ఆదిత్య సింగ్‌పై అతని రెండవ భార్య ఫిర్యాదు చేయగా అతడి బాగోతం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం..
ఇందిరా నగర్ సెక్టార్ 9లో నివసించే బాధితురాలికి నిందితుడు 2015లో పరిచయమయ్యాడు. క్రైం బ్రాంచ్‌లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పేవాడు. బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్న నిందితుడు ఆమెను బెదిరించి వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత బాధితురాలికి అబిద్ నిజ స్వరూపం తెలిసింది.
తనను మతం మార్చుకోవాలని అబిద్ బలవంత పెట్టాడని, లేదంటే చంపేస్తానని బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. నిందితుడు ఎందరో మహిళలను ఇదే తరహాలో మోసం చేసినట్లు ఆమె చెప్పిందని వెల్లడించారు.
బాధితురాలిపై వేధింపులకు పాల్పడిన నిందితుడు ఆమె నుంచి రూ.16 లక్షలు తీసుకుని పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఝాన్సీలో మరో మహిళను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి : 3 వేల కిలోల గంజాయి పట్టివేత-ముగ్గురు అరెస్టు