Man Cuts Nose Of Anganwadi Woman : అంగన్వాడీకి వచ్చే పిల్లలు తన ఇంటి ఆవరణలో పెరిగిన పూలను కోశారని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ అంగన్‌వాడీ సహాయకురాలి ముక్కును కోసేశాడు. ఈ అమానుష ఘటన కర్ణాటక బెళగావి జిల్లాలోని బసుర్తే గ్రామంలో జరిగింది. ఈనెల 1న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
సుగంధ మోరే (50) అనే మహిళ అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. కల్యాణి మోరే అనే వ్యక్తి ఇంటికి ఆనుకొని ఈ అంగన్‌వాడీ కేంద్రం ఉంది. రోజులాగే పిల్లలు కూడా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో వారు ఆడుకుంటుండగా కేంద్రం పక్కన్నే ఉన్న ఇంటి బయట పూసిన పూలను తెంపారు. ఇది చూసిన ఇంటి యజమాని కల్యాణి మోరే కోపంతో రగిలిపోయాడు. వెంటనే పిల్లలపై ఉన్న కోపాన్ని కేంద్రంలో పనిచేస్తున్న సుగంధపై చూపించాడు. ఆమెను విపరీతంగా దూషించాడు. అంతటితో ఆగకుండా తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ముక్కు కోశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన సుగంధను బెళగావి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు స్థానికులు.
ఊపిరితిత్తులపై ఎఫెక్ట్
ముక్కుపై దాడి చేయడం వల్ల ఆ ప్రభావం ఆమె ఊపిరితిత్తులపై పడింది. దీంతో ఆమె లంగ్స్లో రక్తస్రావం జరిగి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. ఇక బాధితురాలు సుగంధ మోరే భర్త దివ్యాంగుడు. అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా ఆమెపై జరిగిన ఘటనకు సంబంధించి కాకతి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పొలం పంచాయితీ- మహిళను వివస్త్రను చేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ
Woman Allegedly Assaulted By Stripping Her : ఇదే బెళగావి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. పొలం విషయంలో తలెత్తిన సమస్య కారణంగా ఓ మహిళను ఒకేరోజు రెండుసార్లు అర్ధనగ్నంగా వివస్త్రను చేసి, అసభ్య పదజాలంతో దూషించి హింసించారు కొందరు. ఈ ఘటనలో మహిళల పాత్ర కూడా ఉండడం గమనార్హం.
ఇదీ జరిగింది
నవంబర్ 21న బైలహోంగళలో జరిగిన ఈ దారుణం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళ అభ్యర్థనను ముందు పట్టించుకోలేదు పోలీసులు. వెంటనే ఆమె మహిళా కమిషన్ను ఆశ్రయించారు. కమిషన్ ఆదేశాలతో డిసెంబర్ 30న 6మంది మహిళలు సహా మొత్తం 20మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ ఈ కేసు విషయంలో అరెస్టు చేయలేదని ఆరోపిస్తున్నారు బాధిత మహిళ. కాగా, ప్రస్తుతం ఈ కేసును బెళగావి జిల్లా మహిళా స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
"నాపై దాడి చేసిన నిందితులు మా పొలం పక్కనే పైప్లైన్ వేశారు. అందులో నుంచి వచ్చే నీరు వల్ల మా పంటలు నాశనం అయ్యాయి. ఇదే విషయంపై నేను ప్రజా పను ల శాఖకు ఫిర్యాదు చేశాను. దీంతో ఆ సమస్యను అధికారులు పరిష్కరించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా 25 నుంచి 30 మంది దుండగులు నవంబర్ 21న నాతో ఘర్షణకు దిగి దాడి చేశారు. ఈ క్రమంలో నన్ను అర్ధనగ్నంగా వివస్త్రను చేసి ఓ గదిలో ఉంచి బెదిరించారు. నా దగ్గర ఉన్న ఫోన్, డబ్బులను కూడా వారు లాక్కున్నారు. కొన్ని పత్రాలపై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నారు. ఇక అదే రోజు సాయంత్రం నన్ను విడిచిపెట్టారు."
- ఎఫ్ఐఆర్లో బాధిత మహిళ
ఉద్యోగం చేసే చోట లైంగిక వేధింపులా? - ఈ చట్టం గురించి తెలుసా!
'అరెస్ట్ చేసేందుకే ఈడీ నోటీసులు'- లిక్కర్ కేసులో విచారణకు మూడోసారీ కేజ్రీ గైర్హాజరు