ఇప్పటికే రణరంగాన్ని తలపిస్తున్న బంగాల్ నందిగ్రామ్‌లో.. సోమవారం రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి ఎన్నికల ప్రచారాలతో నందిగ్రామ్ వీధులు హోరెత్తాయి. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. భాజపాకు అధికారాన్ని కట్టబెడితే.. బంగాలీలను రాష్ట్రం నుంచి పంపేస్తుందని మమత ఆరోపించారు. దీదీకి మళ్లీ అధికారాన్ని ఇస్తే.. బంగాల్ ఓ మినీ పాకిస్థాన్‌లా మారుతుందని విమర్శించారు సువేందు.
'భాజపా వద్దు...'
నందిగ్రామ్‌లో ఎన్నికల సభ నిర్వహించారు మమత. గెలిచిన అనంతరం అక్కడ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భాజపాపై విమర్శలు చేశారు.
![Mamata alleges Bengalis will be driven out of state if BJP wins](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11201376_1034_11201376_1617016172451.png)
"మీరు భాజపాకు ఓటేస్తే.. ఆ పార్టీ మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తుంది. గూండాలను నియమించి.. బంగాల్‌ను దోచుకుంటుంది. బంగాలీల ఉనికిపైనే దెబ్బకొడుతుంది. కానీ మీరు టీఎంసీకి ఓటేస్తే.. మీకు ఇంటి వద్దకే ఉచిత రేషన్ వస్తుంది. సంస్కృతిని ప్రేమించలేని వారు, ఇక్కడకి వచ్చి రాజకీయాలు చేయలేరు. నందిగ్రామ్‌లో గూండాయిజం పెరిగిపోయింది. మేము బిరులియాలో సభ నిర్వహించాం. అక్కడ ఉన్న టీఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అధికారి.. తనకు నచ్చింది చేస్తున్నారు. ఆట ఆడటం నాకూ వచ్చు. సింహంలా విరుచుకుపడతాను. నేను బంగాల్ పులిని. మనం ఈ ఆటలో తప్పకుండా గెలవాలి. భాజపా గూండాయిజాన్ని ప్రేరేపిస్తే.. చీపురు, వంట పాత్రలతో సమాధానం చెప్పాలి. నా పేరునైనా మర్చిపోతానేమో కానీ.. నందిగ్రామ్‌ను మాత్రం మర్చిపోలేను."
--- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
'బేగంను గెలిపించొద్దు...'
మమతా బెనర్జీ.. మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తారని విమర్శించారు సువేందు అధికారి. ఖడంబరిలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
![Mamata alleges Bengalis will be driven out of state if BJP wins](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11201450_1050_11201450_1617016162170.png)
"మమతా బెనర్జీకి ఈద్ ముబారక్ చెప్పడం అలవాటు. అదే విధంగా హోలీ ముబారక్ అన్నారు. దీదీలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ఓటమి భయంతోనే ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. 'బేగం'కు ఓటు వేయకండి. బేగంకు ఓటేస్తే.. బంగాల్ మినీ పాకిస్థాన్‌లా మారిపోతుంది."
--- సువేందు అధికారి, భాజపా నేత.
మమతXసువేందు...
ఇన్నేళ్లు మమతకు నమ్మిన బంటుగా.. నందిగ్రామ్ ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన సువేందు అధికారి.. ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. ఇందుకు మమత గట్టిగానే సమాధానమిచ్చారు. సొంత నియోజకవర్గం భవానీపొర్ను వీడి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే నందిగ్రామ్‌లో మమతపై కచ్చితంగా విజయం సాధిస్తానని సువేందు ధీమాగా ఉన్నారు.
బంగాల్ రెండో దశ ఎన్నికల్లో భాగంగా... ఏప్రిల్ 1న నందిగ్రామ్ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. మమత-సువేందు పోటీలో విజేతలు ఎవరనేది మే 2న తేలుతుంది.
ఇదీ చూడండి:- బంగాల్ బరి: అలజడుల నందిగ్రామ్‌లో గెలుపెవరిది?