Guwahati Road Accident : అసోం గువాహాటిలోని జలుకబారి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం..
అసోంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలు నుంచి 10 మంది విద్యార్థులతో కలిసి వెళ్తున్న ఓ స్కార్పియో కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టడం వల్ల అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని బలంగా తాకింది. దీంతో కార్లో ఉన్న 10 మంది విద్యార్థుల్లో ఏడుగురు అక్కడిక్కక్కడే మరిణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గువాహటిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం మార్చురీకి పంపించారు. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని.. ప్రమాదానికి కారు డ్రైవర్ అత్యంత వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మృతులను గువహాటికి చెందిన అరింధమ్ భోవల్, నియార్ దేకా, శివసాగర్‌కు చెందిన కౌశిక్ మోహన్, నాగన్‌కు చెందిన ఉపాంగ్షు శర్మ, రాజ్‌కిరణ్ భూయానంద్, రాజ్‌కిరణ్ భుమనీబంద్, మంగళ్డోయ్‌కు చెందిన కౌశిక్ బారువాగా గుర్తించారు పోలీసులు.
కర్ణాటకలో ఒక్కరోజే 17 మంది..!
కర్ణాటకలో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏకంగా 17 మంది దుర్మరణం పాలయ్యారు. విహారయాత్రలకని కొందరు, శుభకార్యాలకని మరికొందరు వెళ్తున్న క్రమంలో జరిగిన ప్రమాదాల్లో వీరంతా మరణించారు.
కారు టైరు పేలి.. ఆరుగురు!
కొప్పల్ జిల్లాలోని కలకేరి సమీపంలో ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. దీంతో కారు.. రోడ్డుపై వెళ్తున్న లారీని ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు అక్కడిక్కక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా విజయపుర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిలో 4, 2 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈతకు వెళ్లి.. నలుగురు యువకులు!
బెంగళూరు శివారు దేహనహళ్లి సమీపంలోని రామనాథపుర సరస్సులో ఆదివారం నలుగురు యువకులు కలిసి ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వీరంతా నీటిలో గల్లంతయి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంపై సమాచారం అందుకున్న విశ్వనాథ్‌పుర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని నీటిలో మునిగిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి శవాల కోసం గాలిస్తున్నారు. ఈతకు వెళ్లి కొందరు చిన్నారులు, రోడ్డు ప్రమాదాల్లో మరికొందరు చనిపోగా.. హత్యలు, ఆత్మహత్యల కారణంగా ఇంకొందరు తనువు చాలించారు. ఇలా మొత్తంగా ఆదివారం ఒక్కరోజే కర్ణాటక వ్యాప్తంగా 17 మంది మృత్యుఒడికి చేరారు.