మహారాష్ట్రలో క్రమంగా పెరుగుతోన్న కరోనాను అరికట్టేందుకు బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏదైనా ఒక గృహసముదాయంలో ఐదుగురు కన్నా ఎక్కువ కరోనా రోగులున్నట్టు తెలిస్తే ఆ భవనాన్ని సీజ్ చేస్తామని బీఎంసీ కమిషనర్ ఐఎస్ చాహల్ ప్రకటించారు. కల్యాణ మండపాలు, క్లబ్బులు, రెస్టారెంట్లలో నిబంధనలు పాటించని వారిని గుర్తించి భారీ జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు.
ఇక బ్రెజిల్ నగరం నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాల్సిందేనని బీఎంసీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా క్వారంటైన్లో ఉన్నవారి చేతులపై స్టాంపులు వేయనున్నారు. మరోవైపు ముంబయి లోకల్ రైళ్లలో మాస్కులు ధరించని వారిని గుర్తించేందుకు 300 మంది మార్షల్స్ నిత్యం పర్యవేక్షిస్తుంటారని.. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చాహల్ స్పష్టం చేశారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచనున్నట్టు తెలిపారు.
అమరావతి జిల్లాలోనూ..
కరోనాను అరికట్టేందుకు అమరావతి జిల్లా యంత్రాంగం వారాంతపు లాక్డౌన్ను ప్రకటించింది. అయితే ఈ లాక్డౌన్తో అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడకుండా చూస్తామని కలెక్టర్ శైలేష్ నవల్ స్పష్టం చేశారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి.. సోమవారం ఉదయం 7 గంటల వరకు మార్కెట్లు ఇతర సంస్థలు మూసేయాలని ఆదేశించారు. జిల్లాలో పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కఠినమైన లాక్డౌన్ ఆంక్షలను అనుసరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన. ఇక వారాంతపు లాక్డౌన్ సమయంలో మాత్రం బహిరంగ మార్కెట్లు సహా.. ఇతర సంస్థలు మూసేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈత కొలనులు, ఇండోర్ గేమ్స్ సైతం మూసివేయాలని సూచించారు. మతపరమైన కార్యక్రమాలకు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
మిగతా రోజుల్లో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఇతర సంస్థలు యథావిథిగా పనిచేస్తాయని.. అయితే రాత్రి 8 గంటల వరకు మాత్రమే వాటికి అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రాత్రి 10గంటల వరకు తెరుస్తున్నారు.
యావత్మాల్లోనూ..
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలోనూ కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 28 వరకు విద్యాసంస్థలు మూసేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఆదేశించింది. వివాహ వేడుకలు, రెస్టారెంట్లలో 50 శాతం కన్నా తక్కువ మందిని అనుమతిస్తారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడటానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ ఎండీ సింగ్ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అక్కడ కొత్తగా 4,787 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. అమరావతి జిల్లాలో 230 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: రణరంగాన్ని తలపించిన బిహార్ పరీక్షా కేంద్రం