ఇందిరా రవిచంద్రన్ సాధారణ గృహిణి. వంటలంటే మహా ఇష్టం. వేగంగా పని చేయడం అలవాటు. వీటికి భర్త ప్రోత్సాహం తోడయ్యింది. ప్రణాళికాబద్ధంగా సాధన చేసింది.. తనకెంతో ఇష్టమైన వంటలోనే రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఇందిరతో ప్రత్యేక ఇంటర్వ్యూ..
మాది తమిళనాడు రాష్ట్రం, మదురైలోని తిరుమంగళం. నాన్న పండ్ల వ్యాపారి. అమ్మ గృహిణి. ఇంట్లో అమ్మకు సాయం చేయడం అలవాటు. బీఏ చదివాను. మా ఆయన రవిచంద్రన్ నౌకాదళ ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా చాలా రాష్ట్రాలు తిరిగాం. కొత్త కొత్త వంటకాలు చేయడమంటే ఆసక్తి ఎక్కువ. దాంతో ఆయా ప్రాంతాలకు చెందిన వంటలెన్నో నేర్చుకునే దాన్ని.
రికార్డు కోసం ప్రయత్నించు అన్నారు..
మా వారు ఉద్యోగరీత్యా మూడు నెలలు సముద్రం మీద ఉంటారు. పిల్లల చదువు, ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటా. చిన్నప్పటి నుంచి ప్రతి పనినీ వేగంగా చేయడం నా అలవాటు. అలానే వంటనూ నిమిషాల్లో కానిచ్చేస్తా. నా వేగాన్ని చూసి, మా ఆయన రికార్డు కోసం ప్రయత్నించు అని ప్రోత్సహించారు. కేరళకు చెందిన ఓ పదేళ్ల అబ్బాయి గంటలో 172 రకాల వంటలు చేశాడు. అంత చిన్నవాడే సాధించినప్పుడు నేనెందుకు చేయలేనని ఆలోచించా. మూడు నెలల క్రితం సాధన ప్రారంభించా. మొదట్లో గంటలో 36 రకాలు అయ్యేవి.
ఏ రోజు ఎంత సమయంలో ఎన్ని వంటలు చేయగలుగుతున్నానో నోట్ చేసుకోవడం మొదలుపెట్టా. ప్రాక్టీసుతో పాటు, ఏయే రకాలు త్వరగా వండగలమన్న అధ్యయనమూ చేశా. నాపై నాకు నమ్మకం వచ్చేవరకు దరఖాస్తు చేయలేదు. గతనెలలో మా వారికి విశాఖపట్నం బదిలీ అయ్యింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అప్లై చేసుకున్నా. దీనికి వేదికగా మా సొంతూరినే ఎంచుకున్నా.
కెమెరాల ముందు..
ఆగస్టు 22 ఉదయం 10.25 గంటలకు వంట ప్రారంభించా. కావాల్సిన కూరగాయలు, పిండి వంటివన్నీ సిద్ధం చేసుకోవడానికి 3, 4 గంటలపైనే పట్టింది. అన్నీ పొయ్యిపైన వండేవే కాకుండా కొన్ని ఫైర్ ఫ్రీ చేయడానికి అనుమతిచ్చారు. మొత్తం 134 రకాల వంటల్లో 40 రకాలు పండ్ల రసాలు, లస్సీలు, రైతాలతోపాటు శాండ్‌విచ్‌లు, సలాడ్స్. మిగతావి వెజ్, నాన్‌వెజ్ రకంలో బిరియానీ, చేపల కూర, ఫ్రై, కోడి గుడ్ల కూర, ఆమ్లెట్, కప్‌కేక్స్, ఉండ్రాళ్లు, సాంబారు, రకరకాల పకోడీలు, ఇడ్లీలు, గారెలు, పలురకాల దోశలు వంటివన్నీ చేశా. 10.55 కల్లా చేయడం పూర్తయ్యింది. ఇంతమంది మధ్య, కెమెరాలకెదురుగా చేయాలంటే కొంచెం భయం, ఒత్తిడి ఉంటుంది. వాటిని అధిగమిస్తూనే అన్నీ రుచిగా వండగలిగినందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు కొత్త అనుభవాన్నిచ్చింది.
వంటే కాదు.. తోట పెంపకం, పుస్తకపఠనం అంటే కూడా చాలా ఇష్టం. చాలాసార్లు గార్డెనింగ్ పోటీల్లో పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పూలమొక్కలు పెంచి బహుమతులు అందుకున్నా. మా వారు వెయిట్‌లిఫ్టర్. జాతీయ పోటీల్లో విజేతగా నిలిచారు. మా పాప వివేక డిగ్రీ మొదటి సంవత్సరం, బాబు సిద్ధార్థ్ పదోతరగతి. నా లక్ష్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు. అదీ సాధించగలననే నమ్మకం ఉంది.
ఇదీ చూడండి.. వెరైటీ కోసం సుత్లీ చికెన్ ట్రై చేయండిలా!