Womens Casual Leaves MP Government : అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు అదనంగా 7 సాధారణ సెలవులు (క్యాజువల్ లీవ్స్) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఇక నుంచి మహిళా ఉద్యోగులకు ఏడాదికి 20 సాధారణ సెలవు రానున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
1964 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 13 సాధారణ సెలవులు ఉండేవి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులందరికీ 7 సాధారణ సెలవులు అదనంగా ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మహిళలకు మాతృత్వం, ఇంటి సంరక్షణ వంటి బాధ్యతలు ఉన్నాయని.. అందుకే మహిళలకు 7 సాధారణ సెలవులు అదనంగా ఇస్తున్నామని శివరాజ్ సింగ్ తెలిపారు. మహిళా ఉద్యోగులు తమ అవసరాన్ని బట్టి ఈ సెలవులను వినియోగించవచ్చని చెప్పారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర పరిపాలనా శాఖాధికారి గిరిశ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఏడాది ఆఖర్లో మధ్యప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆకట్టుకునేందుకు అధికార బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే.. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం శివరాజ్ సింగ్ వరాల జల్లు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకం, కారుణ్య నియామకాలు, రెగ్యులర్ ఉద్యోగాల భర్తీలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని శివరాజ్ ప్రకటించారు.
Female Workers No Night Shifts: గతేడాది.. మహిళా ఉద్యోగులు డ్యూటీ వేళల్లో మార్పులు చేసింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కార్యాలయాలకు కూడా అమలు అవుతాయని తెలిపింది. మహిళలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, వారు తమ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.