ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంపీల పనితీరులో సమూల మార్పు వచ్చినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. నేడు ప్రజల చేతుల్లోకి ఫోన్లు రావడంతో ఎంపీలకు వచ్చే డిమాండ్లు పెరిగిపోయాయని, అందువల్ల వాళ్లు రోజుకు 12 గంటలు క్షేత్రస్థాయిలోనే ఉండాల్సి వస్తోందన్నారు. లోక్‌సభలో చర్చల నాణ్యత మాత్రం తగ్గినట్లు వాదన వినిపిస్తోందని తెలిపారు. 17వ లోక్‌సభ కార్యకలాపాలు అత్యంత ఫలప్రదంగా సాగినట్లు తెలిపారు. 14, 15, 16 లోక్‌సభ సమావేశాలు తొలి 8 సెషన్లు 71% నుంచి 95% మేర ఫలితాలను సాధిస్తే 17వ లోక్‌సభ ఇప్పటివరకు 106% ఉత్పాదకత సాధించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 149 బిల్లులు ఆమోదం పొందడంతోపాటు, వివిధ అంశాలపై 995 గంటల మేర చర్చ చేపట్టినట్లు తెలిపారు. ఒక్కో బిల్లుపై చర్చకు సగటున 132 నిమిషాలు తీసుకున్నట్లు చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగం, జెమ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు చేపట్టడంవల్ల ఈ మూడేళ్లలో రూ.668.86 కోట్లు ఆదా చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 46 లక్షల పేజీలు డిజిటలీకరించామని, జులై చివరికల్లా లోక్‌సభ చర్చలకు సంబంధించిన ఇంగ్లిష్ వెర్షన్‌ను డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారానికి మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విలేకర్లతో ఓం బిర్లా ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
మూడేళ్లలో మీకు సంతృప్తినిచ్చిన అంశమేంటి?
కొత్తవారికి అత్యధిక సమయమివ్వడం ఎక్కువ సంతృప్తినిచ్చింది. నేను చొరవ తీసుకొని అవకాశం ఇవ్వకపోయి ఉంటే చాలామంది సభలో మాట్లాడటానికే ముందుకు వచ్చే పరిస్థితి ఉండేదికాదు. గంట ముందుగా చెబితే ప్రాంతీయ భాషల్లో మాట్లాడే అవకాశం కల్పిస్తాం.
బిల్లులను స్థాయీ సంఘానికి పంపకుండానే ఆమోదిస్తున్నారన్న విమర్శలున్నాయి కదా?
బిల్లులు గతంలో కంటే తక్కువగా స్థాయీ సంఘానికి వెళ్లాయన్నది నిజం. ఒక్క బిల్లు కూడా అక్కడికి పంపలేదన్నది నిజంకాదు. ప్రభుత్వాలు వేగంగా వీటికి ఆమోదముద్ర వేయించుకొని, తద్వారా ప్రజలకు సత్వరం మేలు చేయాలనుకుంటాయి. ప్రజల హక్కులను లాగేసుకొనే విధంగా ఏ చట్టమూ ఉండదు.
సాగు చట్టాల విషయంలో ఇలాగే జరిగింది కదా?
లోక్‌సభలో ఆ బిల్లులపై ఐదున్నర గంటలపాటు చర్చ జరిగింది. వాటిని స్థాయీ సంఘానికి పంపాల్సిన బిల్లులన్న వాదన సహేతుకమే. బిల్లులు వేగంగా పాస్‌చేయాల్సిన అవసరం ఉందా? లేదంటే స్థాయీ సంఘానికి పంపి చర్చించి విశ్లేషించాలా? అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. స్పీకర్‌గా మా పని సభ ముందుకొచ్చిన బిల్లులపై చర్చా సమయాన్ని పెంచడం, తగ్గించడం వరకే పరిమితం.
ప్రాంతీయ ఆకాంక్షలపై..
ప్రాంతీయ పార్టీలకూ పాలించే అధికారం ఉంది. తమ రాష్ట్రాల అభివృద్ధి అంశాలను అవి సభ ముందుంచుతున్నాయి. బిహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాలు ప్రత్యేక హోదా లాంటి డిమాండ్లు చేస్తున్నాయి. వాటిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాల్సి ఉంటుంది. ఎక్కడైనా లోపం ఉందని భావిస్తే దాన్ని సరిదిద్దడానికి ప్రత్యేక పథకాలను అమలుచేస్తుంది.
కేసీఆర్ జాతీయ పార్టీ గురించి..
పార్టీ పెట్టే అధికారం అందరికీ ఉంది. జాతీయ పార్టీ హోదా దక్కడానికి ఎంత ఓట్లశాతం రావాలి, ఎన్ని రాష్ట్రాల్లో పోటీచేయాలన్న విషయమై నిబంధనలున్నాయి. కొత్త పార్టీల ఆవశ్యకతపై నిర్ణయం ప్రజలదే.
చట్టసభల్లో చర్చా ప్రమాణాలు తగ్గాయన్న విమర్శ ఉంది కదా?
ఒకప్పుడు సభలో స్వాతంత్య్ర సమరయోధులు ఉండేవారు. నెహ్రూ, పటేల్, అటల్, ఆడ్వాణీ, లోహియా వంటి గొప్ప వ్యక్తులకు నెలవుగా ఉండేది. ఆ కాలం వేరు. ప్రజాస్వామ్యంలో అన్నీ మారిపోయాయి. ప్రజల ఆశలు, ఆకాంక్షల్లో మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎంపీని కలవడం ప్రజలకు అంత సులువుకాదు. ఎస్టీడీ కోడ్ కొట్టి ఎంపీతో ఫోన్‌లో మాట్లాడటానికి గంటలు పట్టేది. దానివల్ల అప్పట్లో పార్లమెంటు సభ్యులకు తీరిక ఉండేది. బిల్లులు చదివి, శోధించి చర్చల్లో పాల్గొనేందుకు వారికి అవకాశం దొరికేది. ఇప్పుడు ప్రజలు వాట్సప్, సెల్‌ఫోన్ ద్వారా నేరుగా ఎంపీని సంప్రదిస్తూ సమస్యలు చెబుతున్నారు. దీనివల్ల ఎంపీలు రోజుకు 12 గంటలు క్షేత్రస్థాయిలోనే ఉండాల్సి వస్తోంది. వారికి పనిభారం పెరిగింది.
ఎంపీలు శాసనాల బాధ్యతలను విస్మరించి కార్యనిర్వాహక విధుల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం వల్లే వారికి ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయన్న వాదన ఉంది కదా?
ఎంపీలు అలా చేయడం లేదు. వారికి అలాంటి అధికారాలు లేవు. అయితే సౌకర్యాల లేమిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు వారు అధికారులతో మాట్లాడాల్సి వస్తోంది. అది కార్యనిర్వాహక అధికారాల్లో జోక్యం చేసుకోవడం కాదు. ప్రజల డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే వ్యతిరేకత తప్పదు.
కొన్ని బిల్లులను సభకు గంట, రెండు గంటల ముందు తీసుకొచ్చి ఆమోదింపజేస్తున్నారు కదా?
ఇలాంటి విధానాన్ని మేం సమ్మతించడంలేదు. కనీసం రెండు మూడురోజుల ముందు బిల్లు సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం.
బిల్లులు సరిగా పాస్ చేయడంలేదని సుప్రీంకోర్టు పలుసార్లు వ్యాఖ్యానించింది కదా?
ప్రజాస్వామ్యంలో అన్ని రాజ్యాంగ సంస్థలకూ హద్దులు నిర్ధరించారు. అందువల్ల అన్ని వ్యవస్థలూ తమ అధికారాలను ఉపయోగించుకోవాలి. బిల్లులను సరిగా రూపొందించకపోవడంవల్ల న్యాయపరమైన సమస్యలు వస్తున్నాయన్న వాదన ఉంది. అందుకే సభలో విస్తృత చర్చ జరగాలంటున్నా. బిల్లు ముసాయిదా సరిగాలేనప్పుడు సభ్యులు ఆ విషయాన్ని సభలో చెప్పొచ్చు. బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు కోణం, ఎంపీల కోణం వేర్వేరుగా ఉన్నాయి. ఈ అంశంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే నడుచుకుంటున్నామని పార్లమెంటు సభ్యులు అంటున్నారు.
ఇదీ చూడండి: 'ఆ విషయంలో తగ్గేదే లే'.. అగ్నిపథ్ పథకంపై రాజ్‌నాథ్
'నా భర్త లిప్స్టిక్ పెట్టుకుంటున్నాడు.. సెక్స్ చేయట్లేదు'.. కోర్టు మెట్లెక్కిన మహిళ