కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ వంటి చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరం అనిపిస్తే కర్ణాటకలో లాక్‌డౌన్ విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. 'ప్రజలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటాం. లాక్‌డౌన్ అనివార్యమైతే విధిస్తాం' అని అన్నారు.
రెండో దశ కరోనా వ్యాప్తిలో భాగంగా ఆదివారం నాటికి రాష్ట్రంలో 10వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా తనతో స్వయంగా మాట్లాడారని యడియూరప్ప తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. రాత్రి కర్ఫ్యూ విధించిన విషయాన్ని మోదీకి వివరించినట్లు స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్‌లు వాడాలని, భౌతికదూరం పాటించాలని కోరారు యడ్డీ. 'ప్రజలు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా సహకరించని పక్షంలో తప్పకుండా చర్యలు ఉంటాయి. అందుకు అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా. ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సహకరించండి' అని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: భారత్లో స్పుత్నిక్-వి టీకా వినియోగానికి ఓకే!