ఓ చిరుత పులి కుక్కను వేటాడబోయింది. తరుముకుంటూ వచ్చేసరికి ఆ జాగిలం ప్రాణభయంతో ఓ మరుగుదొడ్డిలో దూరింది. చిరుత కూడా అందులోకి ప్రవేశించింది. ఇంతలో ఆ ఇంటి యజమాని మరుగుదొడ్డకి బయట తాళం వేసేసరికి రెండు అందులో బందీ అయ్యాయి. బయటకు పోయే దారి లేక చిరుత అయోమయంతో వేటను మరిచి మూలన నక్కింది. కుక్క తనకు అందుబాటులోనే ఉన్నా దాన్నేమీ చేయలేదు. దాదాపు రెండు గంటల సేపు అవి మరుగుదొడ్డిలోనే ఉండిపోయాయి. ఈ ఘటన కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్ర సమీపంలోని కైకంబ అనే గ్రామం వద్ద చోటుచేసుకుంది.
బుధవారం ఉదయం కుక్కను తరుముకుంటూ వచ్చిన చిరుత స్థానిక రేగప్ప అనే రైతు నివాసంలోకి దూసుకెళ్లింది. అక్కడి మరుగుదొడ్డిలోకి శునకం ప్రవేశించడంతో చిరుత కూడా లోనికి చొరబడింది.
అడవిలోకి పరుగులు..
కుటుంబ సభ్యులు వెంటనే మరుగుదొడ్డి తలుపును బంధించారు. లోపల ఒకవైపు చిరుత- మరొక వైపు శునకం ఉండడాన్ని పైనుంచి సెల్ ఫోన్లల్లో చిత్రీకరించి, ఆ విషయాన్ని అటవీ అధికారులకు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు వల, మత్తు మందు సాయంతో బంధించేందుకు ప్రయత్నించారు. అయితే.. వాటిని ఉపయోగించే తీరులో తేడాలొచ్చి చిరుత రెప్పపాటు కాలంలో సమీప అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది. కుక్క కూడా ప్రాణాలతో బయటపడింది. రెండు గంటలపాటు శ్రమించినా.. అటవీ సిబ్బంది అనుభవ రాహిత్యం కారణంగానే చిక్కిన చిరుత తప్పించుకుందని స్థానికులు ఆక్రోశించారు.
ఇదీ చూడండి: రిహానా, గ్రెటా ట్వీట్లకు బాలీవుడ్ తారల కౌంటర్