"బాధల్లో ఉన్న ప్రజలు మంచి దుస్తులు ధరించి, పాండిత్యం ఉన్న న్యాయవాదులు, ఆడంబరమైన కోర్టు భవంతులవైపు చూడరు. తమ దగ్గరున్న వనరులు ఆవిరి కాక ముందే త్వరగా వేదనల నుంచి విముక్తి లభించాలని కోరుకుంటారు. అందువల్ల న్యాయవ్యవస్థ తమకోసమే ఉందన్న భావనను ప్రజల్లో కల్పించేందుకు న్యాయవ్యవస్థలోని వారంతా పనిచేయాలి" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ న్యాయసేవల ప్రాధికారసంస్థ (నల్సా) ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి న్యాయ చైతన్య కార్యక్రమం ముగింపు ఉత్సవంలో ఆయన ప్రసంగించారు.
"ప్రజలు అంతిమ ఆశగా న్యాయవ్యవస్థపై విపరీతమైన విశ్వాసాన్ని పెట్టుకున్నారు. కోర్టులు వెలువరించే నిర్ణయాలు సమాజంపై తీవ్రప్రభావం చూపుతాయి. కాబట్టి అవి సమగ్రంగా ఉండాలి. స్పష్టంగా అర్థమయ్యేలా సరళ భాషలో రాయాలి. ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా నిజమైన స్వాతంత్య్రం సాధ్యం కాదు, ఆకలితో ఉన్న వ్యక్తికి స్వాతంత్య్రం గురించి చెప్పడం అంటే అతడిని ఎగతాళి చేయడమేనని నెహ్రూ అంటారు" అని తెలిపారు.
న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడాలి
ఇప్పటికీ సమాజంలో ధనికులు, పేదల మధ్య స్పష్టమైన విభజన ఉండటం కాదనలేని సత్యమని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. "హక్కుల ద్వారా పేదరికాన్ని జయించేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్న ఉద్దేశంతోనే జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ గాంధీ జయంతి రోజు నుంచి 7 వారాలపాటు దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించింది. సంక్షేమ రాజ్యానికి రూపునివ్వడంలో భారతీయ న్యాయవ్యవస్థ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంది. క్షేత్రస్థాయిలో పకడ్బంధీగా న్యాయం అందించే వ్యవస్థ లేకపోతే న్యాయవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం కష్టం. అందువల్ల అన్ని స్థాయుల్లో న్యాయవ్యవస్థ సమగ్రత, స్వతంత్రతను కాపాడడానికి మించిన ముఖ్యమైన అంశం మరొకటి లేదని గుర్తించాలి. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు న్యాయసహాయం అందించే సరికొత్త కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా అణగారిన వర్గాల పిల్లలను నేరాల నుంచి రక్షించాలి. స్థానిక కమ్యూనిటీలకు చెందిన న్యాయవాదులు ఈ న్యాయసేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకొస్తే ఇలాంటి పిల్లలను సరైన పంథాలో నడిపించడానికి వీలవుతుంది" అని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ యూయూ లలిత్, సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీ ఛైర్మన్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'మాఫియా'పై పోరాడిన జర్నలిస్ట్ హత్యపై దుమారం- స్థానికుల నిరసన