దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌కు గురువారం స్వేచ్ఛ లభించింది. ప్రస్తుతం అనారోగ్యంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అక్కడి నుంచే ఆయనకు విముక్తి దక్కింది. అయితే మరికొన్నాళ్లు లాలూ.. అక్కడే ఉండి, చికిత్స పొందుతారు.
సదరు కేసులో ఈ నెల 17న లాలూకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా 19న రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టును ఆశ్రయించి, బెయిలు లాంఛనాలు పూర్తిచేయాలని లాలూ న్యాయవాదులు భావించారు. అయితే కొవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో బార్ కౌన్సిల్ పిలుపు మేరకు లాయర్లు.. న్యాయస్థానాలకు హాజరుకావడం ఆపేశారు.
తాజాగా బార్ కౌన్సిల్ తన నిబంధనలను సడలించడంతో ఆర్జేడీ అధినేతకు ఊరట లభించింది. గురువారం రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో బెయిలుకు సంబంధించిన లాంఛనాలను ఆయన తరఫు న్యాయవాదులు పూర్తిచేశారు. దీంతో ఆయన విడుదలకు న్యాయమూర్తి ఎం.కె.మిశ్ర ఆదేశాలిచ్చారు. ఈ ఉత్తర్వులు బిర్సా ముండా కారాగారానికి చేరాయి. జైలు అధికారులు వాటిని ఎయిమ్స్‌లోని సంబంధిత అధికారులకు పంపారు. గురువారం సాయంత్రం లాలూకు విముక్తి లభించింది.