Lakshadweep New Airport : మాల్దీవులు- భారత్ మధ్య పర్యటక ప్రదేశాలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్‌ను పర్యటకంగా అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది. అందుకే లక్షద్వీప్‌లోని మినీకాయ్ దీవులలో కొత్త ఎయిర్‌ఫీల్డ్(వైమానిక కేంద్రం) నెలకొల్పాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను ఫైటర్ జెట్లు, సైనిక విమానాలు, వాణిజ్య విమానాలు కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.
మినీకాయ్ దీవులలో ఈ కొత్త ఎయిర్‌ఫీల్డ్‌ను అభివృద్ధి చేయడానికి గతంలో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే భారత్-మాల్దీవుల మధ్య పర్యటకంపై ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశభద్రత విషయంలోనూ భారత్‌కు మినీకాయ్ దీవులు చాలా కీలకం. ఎందుకంటే మినీకాయ్ దీవులు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతానికి దగ్గర్లో ఉంటాయి.
కొన్నాళ్ల క్రితం మినీకాయ్ దీవుల్లో ఎయిర్‌ఫీల్డ్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఇండియన్ కోస్ట్‌గార్డు కోరింది. అక్కడి నుంచి తమ కార్యకలాపాలను నిర్వహించడానికి సిద్ధమని తెలిపింది. అయితే భారత్-మాల్దీవుల మధ్య తాజాగా చెలరేగిన నేపథ్యంలో ఇండియా లక్షద్వీప్‌లో ఎయిర్‌ఫీల్డ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, మినీకాయ్లోని ఎయిర్‌ఫీల్డ్‌ను ఏర్పాటు చేయడం వల్ల రక్షణ దళాలు అరేబియా సముద్రంపై నిఘా పెట్టేందుకు ఉపయోగపడుతుంది. పర్యటకంగానూ లక్షద్వీప్ కూడా అభివృద్ధి చెందుతుంది.
'ప్రతి విషయాన్ని మోదీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు'
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. 'నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి. సమయానుకూలంగా వ్యవహరించాలి.' అని ఖర్గే అభిప్రాయపడ్డారు.
మోదీకి పవార్ మద్దతు
మాల్దీవులతో వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మద్దతుగా నిలిచారు. ఇతర దేశం ప్రధానిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే అంగీకరించబోమని చెప్పారు. ప్రధాని పదవిని గౌరవించాలని ముంబయిలో మీడియా సమావేశంలో తెలిపారు. ఇతర దేశాలు ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని పేర్కొన్నారు.
ఖండించిన 'మాటీ'
India Maldives Issue : భారత్‌తో దౌత్యపరమైన వివాదం నెలకొన్న వేళ మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ(మాటీ) స్పందించింది. భారత్ సహా ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మాటీ ఈ మేరకు స్పందించింది. మాల్దీవుల పర్యటక పరిశ్రమకు భారత్ స్థిరమైన, గణనీయమైన సహకారాన్ని అందిస్తోందని కొనియాడింది. కొవిడ్-19 మహమ్మారి ప్రభావం తర్వాత తాము కోలుకోవడానికి భారత్ ఎంతో సహకారం అందించిందని పేర్కొంది. భారత్‌ను సన్నిహితమైన పొరుగుదేశం, మిత్రదేశం అని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. చరిత్రను చూస్తే వివిధ సంక్షోభాల సమయాల్లో భారత్ మొదట స్పందించిందని, భారత ప్రజలు తమతో కొనసాగించిన సన్నిహిత సంబంధానికి తాము ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామని మాటీ పేర్కొంది.
మాల్దీవుల పర్యటకశాఖ గణాంకాల ప్రకారం గతేడాది ఆ దేశాన్ని 17 లక్షల మంది విదేశీ పర్యటకులు సందర్శించారు. అందులో 2 లక్షల 9 వేల మంది భారతీయులు ఉన్నారు. 2023లో మాల్దీవులను సందర్శించిన విదేశీయుల జాబితాలో భారతీయులదే అగ్రస్థానంకాగా, రష్యన్లు రెండో స్థానంలో ఉన్నారు. 2022లో 2 లక్షల 40 వేల మంది, 2021లో 2 లక్షల 11 వేల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించడం గమనార్హం.
ఇదీ వివాదం
India Maldives Conflict : తాజాగా ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవ్వడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మాల్దీవులకు విమాన టికెట్ల బుకింగ్, హోటల్ బుకింగ్‌లను పలువురు భారతీయులు రద్దు చేసుకున్నారు. భారత సెలబ్రిటీలు కూడా మాల్దీవులకు బదులు లక్షద్వీప్‌ను పర్యటక గమ్యస్థానంగా ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిణామాలు తమ పర్యటక ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మాల్దీవులు ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది.
ట్రెండింగ్‌లోకి లక్షద్వీప్- 3వేల శాతం పెరిగిన గూగుల్ సెర్చింగ్
మోదీ లక్షద్వీప్ పర్యటన- ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ మాల్దీవులు'- చర్యలు తీసుకుంటామన్న సర్కార్