Vaccine lucky draw Gujarat: ప్రజలు టీకాలు వేసుకునే విధంగా ప్రోత్సహించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తోంది గుజరాత్లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎమ్సీ). ఇందులో భాగంగా ఓ లక్కీ డ్రాను ఏర్పాటు చేసింది. అందులో ఓ కూలీకి ఐఫోన్-12 దక్కింది.
టీకా వేసుకుంటే..
ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి నగరంలో 100శాతం వ్యాక్సినేషన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏఎమ్సీ ఆరోగ్యశాఖ. ఇందులో భాగంగా ఈ నెల 1-7 మధ్య టీకా రెండు డోసులు తీసుకున్న వారు లక్కీ డ్రాలో పాల్గొనాలని ఆహ్వానించింది.
కొన్ని రోజులకు ఆరోగ్యశాఖ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. స్థానిక మీడియాల కథనాలు రావడం వల్ల లక్కీ డ్రా తీసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కిషన్ భాయ్ మక్వానాను రూ. 70వేల విలువ చేసే ఐఫోన్-12 వరించింది.
'అసలు నమ్మలేదు..'
ఇంత ఖరీదైన బహుమతి లభించడంపై కిషన్భాయ్ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. తనకు లక్కీ డ్రా వచ్చిందంటే తొలుత నమ్మలేదని ఆయన వివరించారు.
"కరోనా రెండో డోసు టీకా వేసుకోవడం వల్ల నాకు ఐఫోన్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. తొలుత ఆ విషయాన్ని నేను నమ్మలేదు. నన్ను మోసం చేసేందుకు అలా చెబుతున్నారని అనిపించింది. అందుకే వారి ఫోన్లు ఎత్తడం కూడా మానేశాను. స్విచ్ ఆఫ్ చేసేశాను. కానీ టీకా తీసుకునే సమయంలో నా ఆధార్ కార్డు ఇచ్చాను. అందులో నా ఇంటి అడ్రెస్ కూడా ఉంది. అది చూసి ఓ రోజు అధికారులు నా ఇంటికి వచ్చారు. జరిగింది వివరించారు. చాలా సంతోషంగా ఉంది."
-- కిషన్భాయ్, కూలీ
vaccine lucky draw India: అయితే ఐఫోన్ కోసం కిషన్భాయ్ టీకా తీసుకోలేదు. కరోనాపై పోరులో టీకాలు సమర్థంగా పనిచేస్తాయన్న నమ్మకంతోనే టీకా కేంద్రానికి వెళ్లాడు. ప్రజలు కూడా తొందరగా టీకాలు వేసుకోవాలని పిలుపునిచ్చాడు కిషన్భాయ్.
ఇదీ చూడండి:- టీకా వేసుకో.. బహుమతి తీసుకో.. కేంద్రం కొత్త ఆఫర్!