KRMB Three Member Committee Meeting Postponed: ఉమ్మడి జలాశయాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఎక్కువ నీటిని వినియోగించుకున్నందున తదుపరి అనుమతి ఇవ్వవద్దని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఛీఫ్ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరారు. హైదరాబాద్ జలసౌధలో సోమవారం జరగాల్సి ఉన్న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది.
శాసనసభ సమావేశాలు ఉన్నందున ఇవాళ జరగాల్సిన భేటీకి హాజరు కావడం వీలు కాదని బోర్డుకు ముందే ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమాచారం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురేను కలిసిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్... తమ వాదనలు వినిపించారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ ఇప్పటికే ఎక్కువ నీటిని ఉపయోగించుకొందని... ఇంకా వినియోగించుకుంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలిపారు. తమకు ఇంకా నీటిలో వాటా ఉందని ఏపీ చెబుతున్న లెక్కలు సబబు కాదని అన్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ఈఎన్సీ బోర్డును కోరారు. ఆలస్యం చేస్తే పంటకాలం కూడా పూర్తవుతుందని తెలంగాణకు నష్టం జరుగుతుందని అన్నారు.
ఏపీ తన వాటాకు మించి నీటిని వాడుకుంది : మార్చి 8న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా నీటి విడుదల అంశం మీదనే కేఆర్ఎంబీకి లేఖ రాశారు. అందులోను ఇవాళ సభ్య కార్యదర్శికి చెప్పిన విషయాలనే మురళీధర్ ప్రస్తావించారు. ఏపీ ఈ సంవత్సరం ఇప్పటికే ఉమ్మడి జలాశయాల నుంచి వాటాకు మించి నీటిని ఉపయోగించుకుందని... ఇక నుంచి నీటిని వాడుకోకుండా చూడాలని బోర్డును కోరారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఫిబ్రవరి ఆఖరుకు ఆంధ్రప్రదేశ్ 673 టీఎంసీల కృష్ణా నీటిని ఉపయోగించుకుందని.. 971 టీఎంసీల్లో ఇది 74 శాతానికి పైగా ఉందని మురళీధర్ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ కేవలం 211 టీఎంసీలను మాత్రమే వాడుకొందని... 971 టీఎంసీల్లో ఇది కేవలం 25 మాత్రమేనని రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఏపీ తన వాటాకు మించి 32 టీఎంసీలను అధికంగా ఉపయోగించుకొందని... తెలంగాణకు ఈ ఏడాది ఇంకా 108 టీఎంసీలు వాటాగా దక్కాల్సి ఉందని లేఖలో వివరించారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఇంకా కేవలం 76 టీఎంసీల నీరు మాత్రమే ఉందని... ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి నీటిని తీసుకొందని ప్రస్తావించారు.
ఇవీ చదవండి: