Kishanreddy As Telangana BJP President : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ సంస్థాగత మార్పులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించింది.
బీజేపీకి విధేయుడిగా తన బాధ్యతలను నిర్విరామంగా కొనసాగిస్తూ... తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గంగాపురం కిషన్‌రెడ్డి మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటికే కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయనకు పార్టీ రాష్ట్ర సారథిగా బీజేపీ అధిష్ఠానం బాధ్యతలను అప్పగించింది. 3సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలుపొంది... కేంద్ర క్యాబినేట్‌లో చోటు సంపాదించిన కిషన్‌రెడ్డి... తన కృషి, పట్టుదల, నిజాయితీ, ఓర్పుతో కూడిన ఆయన వ్యక్తిత్వమే అధిష్ఠానాన్ని మెప్పించేలా చేసింది.
కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానమిలా : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన కిషన్‌రెడ్డి... బీజేపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన... తెలంగాణ వచ్చాక 2014 నుంచి 2016వరకు పార్టీ సారథిగా పనిచేశారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రెండుసార్లు వ్యవహరించారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, వాజ్‌పేయీ ఆదర్శాలకు ఆకర్షితుడైన కిషన్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే అప్పటి జనతా పార్టీలో చేరారు. ఓవైపు పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తన చదువును కొనసాగించారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చిన కిషన్‌రెడ్డి అప్పటి జనతా పార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశారు. 1980లో భారతీయ జనతాపార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరారు.
2014-16 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్‌రెడ్డి : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 1999లో కార్వాన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కిషన్‌రెడ్డి తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004లో హిమాయత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన అంబర్‌పేట నుంచి 2009, 2014లో వరుసగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో పరాజయం పాలైన కిషన్‌రెడ్డి 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మోదీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్న ఆయన.. ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా కేంద్ర క్యాబినేట్‌లో కొనసాగుతున్నారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటారని కిషన్‌రెడ్డికి పేరుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో షాక్ తిన్నప్పటికీ ఫలితాలు వచ్చిన మరుసటిరోజే అంబర్‌పేటలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పొచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేటలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిన కిషన్‌రెడ్డి, లోక్‌సభ ఎన్నికల్లో అదే అంబర్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో 45 వేల మెజార్టీని సాధించడం విశేషం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కరోనా సమయంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సౌమ్యుడు, వివాద రహితుడు, పార్టీకి విధేయుడిగా తన బాధ్యతలను నిర్విరామంగా కొనసాగించడం ద్వారా ప్రత్యేక ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించారు.
ఇవీ చదవండి: