కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్‌సింగ్, నరేంద్రమోదీల పనితీరుపై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృష్టి కోల్పోయిందని ఆయన తన ఆత్మకథలో పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడంలో సోనియాగాంధీ విఫలం కావడం... ఎంపీలకూ, మన్మోహన్‌కూ మధ్య వ్యక్తిగత సంప్రదింపులు ముగిసిపోవడం పార్టీ పతనానికి దారితీశాయని రాసుకొచ్చారు. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ కొవిడ్ బారినపడి ఆగస్ట్ 31న మృతిచెందారు. అంతకుముందే ఆయన రాసిన '‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆత్మకథ'ను రూపా పబ్లిషర్స్ వచ్చే జనవరిలో ప్రచురించనుంది. కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తున్న తరుణంలో... ప్రణబ్ పుస్తకంలోని కీలక విషయాలు వెలుగుచూడటం రాజకీయ ఆసక్తిని రేకెత్తించింది. ప్రచురణ సమాచారాన్ని వెల్లడిస్తూ... ప్రణబ్ పుస్తకంలోని పలు కీలక వ్యాఖ్యలను రూపా సంస్థ బహిర్గతం చేసింది.
నేను ప్రధానిని అయి ఉంటే...
‘‘2004లో నేను ప్రధాని పదవిని చేపట్టి ఉండుంటే... 2014లో పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకొని ఉండకపోయేదని కాంగ్రెస్ పార్టీలో చాలామంది సూత్రీకరించారు. ఆ అభిప్రాయాన్ని నేను సమ్మతించను. కానీ, నేను రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత పార్టీ అగ్ర నాయకత్వం రాజకీయ దృష్టి కోల్పోయిందని విశ్వసిస్తున్నా. ముఖ్యంగా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో సోనియా విఫలమయ్యారు. హౌస్‌కు మన్మోహన్ దూరంగా ఉండటంతో ఎంపీలు ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కోల్పోయారు.
కూటమి రక్షణలో మునిగిపోయారు
కూటమిని రక్షించుకోవడంలోనే మన్మోహన్ మునిగిపోయేవారు. ప్రధాని మోదీ అయితే తన తొలి ఐదేళ్ల పాలనలో నియంతృత్వ విధానాన్ని అనుసరించినట్టే ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య చేదు సంబంధాలు నెలకొన్నాయి. ఈ విషయం ఆయన రెండో దఫా పాలనలో మరింత బాగా అర్థమవుతుందా? అన్నది కాలమే చెబుతుంది. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన కారులో నన్ను కూర్చోమన్నారు. అందుకు నేను గౌరవంగా, గట్టిగా తిరస్కరించాను.
అమెరికా అధ్యక్షుడు భారత రాష్ట్రపతితో కలిసి ప్రయాణించేటప్పుడు భారత ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లను విశ్వసించాలి. అదే విషయాన్ని అమెరికా అధికారులకు చేరవేయండని విదేశీ వ్యవహారాల శాఖకు చెప్పాను’’ అని ప్రణబ్ తన పుస్తకంలో పేర్కొన్నట్టు పబ్లిషర్ సంస్థ తెలిపింది. బెంగాల్‌లోని కుగ్రామం నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ తన ప్రయాణం సాగిన తీరును; రాష్ట్రపతిగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సందర్భాలను ప్రణబ్ ముఖర్జీ వివరించారని వెల్లడించింది.
ఇదీ చదవండి : రసవత్తర రాజకీయం- వేడెక్కుతున్న పశ్చిమ్ బంగ