కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా.. ఆగదనేది పెద్దలు చెప్పే మాట. కరోనా కూడా కల్యాణానికి అడ్డుకాదని నిరూపించింది కేరళలోని ఓ యువజంట. పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి కొవిడ్ మహమ్మారి అడ్డుగా నిలిచినా.. కొవిడ్ కేంద్రంలోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
ఇరు కుటుంబాల నిర్ణయంతో..
అలప్పుజలోని కైనకారికి చెందిన అభిరామి, శరత్ మన్‌లకు ఏడాది క్రిందటే పెళ్లి నిశ్చయమైంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వరుడు శరత్... పెళ్లి పనుల్లో హడావుడిగా ఉన్న సమయంలో కరోనా బారినపడ్డాడు. శరత్ తల్లికి కూడా కరోనా సోకింది. దీంతో వీరిద్దరినీ.. అలప్పుజ వైద్యకళాశాలలో ఉన్న కొవిడ్ వార్డుకు తరలించారు. అయితే ముందుగా నిశ్చయించిన ప్రకారం.. 25వ తేదీనే వివాహం జరిపించాలని రెండు కుటుంబాలు నిర్ణయించాయి.
ఆమోదం లభించగా..
దీంతో.. కరోనా వార్డులో పెళ్లి జరిపించేందుకు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వారి నుంచి ఆమోదం లభించగానే.. కొవిడ్ సెంటర్ వేదికగా పెళ్లి జరిపించారు. వధువు అభిరామి పీపీఈ కిట్ ధరించగా.. వరుడు శరత్..పెళ్లి కుమార్తె మెడలో మూడు ముళ్లువేశాడు.
ఇదీ చూడండి: ఆయన ఇల్లే ఓ వింటేజ్ బైక్ మ్యూజియం!
ఇదీ చూడండి: వీరి మనోధైర్యం ముందు తోకముడిచిన కొవిడ్