Akansha Puranik: సితార్, తబలా, హార్మోనియంపై ఆమె సుస్వరాలు పలికించగలదు. కీబోర్డ్, గిటార్ వాయిస్తూ రాక్‌స్టార్‌లా మారిపోగలదు. మైక్ పట్టి పాటలు పాడుతూ శ్రోతల్ని సంగీత ప్రపంచంలో విహరింపచేయగలదు. భరతనాట్యంతో వీక్షకుల్ని ముగ్ధుల్ని చేయగలదు. సంప్రదాయ కళలే కాక.. మరెన్నో రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది కర్ణాటక కలబురగికి చెందిన ఆకాంక్ష పురాణిక్. పాటలు పాడడం, నాట్యం చేయడం, సంగీత పరికరాలు వాయించడం, కరాటే, కిక్ బాక్సింగ్ వంటి 60కిపైగా కళల్లో ప్రావీణ్యం సాధించింది ఆమె. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని.. 300కుపైగా మెడల్స్, షీల్డ్స్, 600కుపైగా సర్టిఫికెట్లు సొంతం చేసుకుంది.
"మా అమ్మే నాకు స్ఫూర్తి. నేను అన్ని రంగాల్లోనూ రాణించాలన్నది ఆమె కల. కరాటేలో చేరేందుకు నా సోదరులు కారణం. వారు కరాటే క్లాసులకు వెళ్లేవారు. ఓసారి చూసేందుకు వెళ్లా. నాకు ఆసక్తి కలిగి కరాటేలో చేరా. నా సోదరుడు తబలా క్లాస్‌కు వెళ్లేవాడు. అది చూసి నేను కూడా చేరా. అలా అన్నింటిలోనూ చేరా. ఐఏఎస్ అధికారి అయి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం."
--ఆకాంక్ష పురాణిక్
Kalaburagi Girl News
17 ఏళ్ల ఆకాంక్ష ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆరో తరగతిలో ఉండగా.. ఇలా వేర్వేరు కళలపై ఆమెకు ఆసక్తి కలిగింది. తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అవసరమైన శిక్షణ ఇప్పించారు.
"అమె ప్రతిదీ నేర్చుకోవాలని అనుకుంటుంది. ఏదైనా పట్టుకుంటే వదిలిపెట్టదు. అసలు అలిసిపోదు. తబలా నేర్చుకుంది. హార్మోనియం, గిటార్ వాయించగలదు. కరాటేలో బ్లాక్ బెల్ట్‌తో జాతీయస్థాయి ఛాంపియన్. ఎన్సీసీలో కూడా ఉంది."
--విజయ్ కుమార్, ఆకాంక్ష బంధువు
హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తెలుగు, మరాఠీ.. ఇలా ఐదు భాషల్లోనూ ఆకాంక్షకు ప్రావీణ్యం ఉండడం మరో విశేషం.