Yediyurappa grand daughter suicide: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనుమరాలు సౌందర్య(30).. బెంగళూరు, వసంత నగరలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

యడియూరప్ప కుమార్తె అయిన పద్మావతి కూతురు సౌందర్య. డాక్టర్ అయిన సౌందర్య 2018లో డాక్టర్ నీరజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిది నెలల చిన్నారి ఉన్నాడు. నగరంలోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తూ.. హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతనగరలో నివాసం ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు సౌందర్య, ఆ పక్కనే 9 నెలల బాలుడిని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు.

అపార్ట్మెంట్లో పని చేస్తున్న క్వాజా హుస్సేన్ అనే వ్యక్తి పలు విషయాలు వెల్లడించారు." ఉదయం 8 గంటలకు నీరజ్ డ్యూటీకి వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత సౌందర్య ఆత్మహత్యకు పాల్పడింది. వారి బాబు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో పనివారు సైతం ఇంట్లోనే ఉన్నారు. పనిమనిషి అల్పాహారం ఇచ్చేందుకు వెళ్లగా ఫ్యానుకు వేలాడుతు సౌందర్య కనిపించింది. వారు గత రెండేళ్లుగా ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు." అని తెలిపారు.

ప్రాథమిక విచారణలో తేలిందేమిటి?
బాబుకు జన్మనిచ్చిన తర్వాత సౌందర్య డిప్రెషన్లోకి వెళ్లారని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని, వారి మధ్య ఎలాంటి కలహాలు లేవని ఇంట్లోని పనివారు చెప్పినట్లు తెలిపారు.



ఇవీ చూడండి: కాంగ్రెస్‌కు 'మహా' షాక్- మిత్రపక్షంలోకి మేయర్ సహా 28 మంది కార్పొరేటర్లు
అంగవైకల్యం ఉన్నా స్విమ్మింగ్‌లో కింగ్- ఈదుతూ నదిని దాటేసిన బాలుడు