"మాది పేద కుటుంబం. ఫోన్ కొనిచ్చే స్తోమత అమ్మా, నాన్నలకు లేదు. అందుకే కూలి పనులకు వెళుతున్నా" అని ఓ విద్యార్థి చెప్పిన మాటలు గ్రామీణ పేదరికానికి, ఆన్లైన్ బోధన అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.
ఆన్లైన్ పాఠాలు (Online class) వినడానికి సిగ్నల్ కోసం చెట్లెక్కిన ఉదంతాలు, ఫోన్లు కొనడానికి మామిడి పండ్లు విక్రయించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటనే కర్ణాటకలోని కొప్పళ్లో జరిగింది.
కుకనూర్ తాలుకా భానాపుర్లో వీరేశ్ అనే విద్యార్థికి ఆన్లైన్ పాఠాలు వినేందుకు ఫోన్ లేదు. తల్లిదండ్రులకు కొనిచ్చే స్తోమత లేదు. దీంతో కొన్నాళ్లుగా వ్యవసాయ పనులకు వెళుతున్నాడు వీరేశ్. అలా రూ.20వేలు సంపాదించాడు. అందులోంచి రూ.10 వేలు పెట్టి ఫోన్ కొనుక్కున్న అతడు.. మిగిలినవాటిని ఇంటి ఖర్చుల కోసం అమ్మానాన్నలకు ఇచ్చేశాడు.
ఇలాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం సహకారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ క్లాసులు వింటుంటే.. బండరాయి మీద పడి...