హరియాణా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ తనను లైంగిక వేధించాడని జూనియర్ మహిళా అద్లెట్ కోచ్ ఆరోపించారు. మంత్రి తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించారని ఆమె తెలిపారు. తనకు అనుకూలంగా వ్యవహరిస్తే అన్నీ సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని ఆమె ఆరోపణలు గుప్పించారు. మంత్రి సందీప్ నాతో సోషల్ మీడియా ద్వారా చాట్ చేశారని.. కానీ చాట్ రికార్డ్ చేయడానికి కుదరని సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారని అథ్లెట్ కోచ్ తెలిపారు.
"మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తే కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తానని అన్నారు. నేను ఆయనకి లొంగకపోవడం వల్ల వేరే ప్రదేశానికి బదిలీ చేశారు. ఈ ఘటనపై డీజీపీ ఆఫీస్, సీఎం కార్యాలయం, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అందుకే ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలను కలిశా. ఆయన ఇచ్చిన ధైర్యంతో మీడియా ముందుకు వచ్చా. ఇలా చాలా మంది మహిళా క్రీడాకారిణులను మంత్రి లైంగికంగా వేధించారు. వారెవరూ మంత్రికి భయపడి బయటికి చెప్పట్లేదు."
--జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్
మహిళా అథ్లెట్ కోచ్‌పై లైంగిక వేధింపుల విషయంలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తక్షణమే స్పందించి.. మంత్రిని బర్తరఫ్ చేయాలని ఐఎన్ఎల్డీ నాయకుడు అభయ్ చౌతాలా డిమాండ్ చేశారు. క్రీడాకారులతో మంత్రి ఇలాగే ప్రవర్తిస్తే వారు మెడల్స్ ఎలా సాధిస్తారని అన్నారు. ఈ ఘటనపై సందీప్ సింగ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత సిట్‌ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.
అరోపణలు నిరాధారం..
తనపై చేసిన లైంగిక ఆరోపణలను మంత్రి సందీప్ సింగ్ ఖండించారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారణమైనవని అన్నారు. క్రీడాకారులెవరైనా సహాయం కోసం తనను సంప్రదిస్తే తప్పకుండా ఆదుకుంటానని అన్నారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రలా అనిపిస్తుందని మంత్రి పేర్కొన్నారు.