నైతికంగా ఉన్నత స్థానంలో ఉన్న జడ్జిలు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి చాలా దూరం వెళ్తారని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. న్యాయవ్యవస్థలోని జడ్జిల నేపథ్యం, విశ్వసనీయతపై సాధారణ ప్రజలకు ఉన్న దృక్కోణానికి (Public Opinion on Supreme Court) చాలా ప్రాముఖ్యత ఉందని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థలోని ఏ స్థాయి అధికారి అయినా అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తారని తెలిపింది.
సివిల్ జడ్జి క్యాడర్లో నియామకం పొందేందుకు ఓ న్యాయమూర్తికి అర్హత లేదని దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కేఎం జోసెఫ్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం (Supreme Court) విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
"దేశంలో చాలా ముఖ్యమైన కార్యకలాపాలను జడ్జిలు నిర్వర్తిస్తుంటారు. సివిల్ జడ్జి, లేదా మేజిస్ట్రేట్ పదవికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే దేశంలో అధిక సంఖ్యలో కేసులు ఈ స్థాయిలోనే నమోదవుతుంటాయి. న్యాయవ్యవస్థలోని ఏ స్థాయి అధికారి అయినా అత్యున్నత ప్రమాణాలను వర్తింపజేస్తారు."
-సుప్రీంకోర్టు (Supreme Court)
2013లో సివిల్ జడ్జి ఉద్యోగానికి రాజస్థాన్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతని మీద కేసులున్నట్లు గుర్తించిన న్యాయస్థానం అనర్హుడిగా తేల్చింది. దానిపై అప్పీలు చేసుకున్న ఆ అభ్యర్థి తాను 2 కేసుల్లో నిర్దోషినని... మరో రెండు కేసుల్లో రాజీ కుదుర్చుకున్నట్లు తెలిపాడు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఇది గౌరవప్రదంగా జరిగిందని చెప్పలేకపోతున్నాం అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సంబంధిత పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేయాల్సిన బాధ్యత హైకోర్టులపై ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: Rohini court firing: న్యాయస్థానాల్లో భద్రతపై సుప్రీంలో పిటిషన్