Jharkhand Political Crisis : ఝార్ఖండ్‌లో అధికార యూపీఏ కూటమి సొంతంగా ప్రవేశపెట్టుకున్న విశ్వాస పరీక్షల్లో నెగ్గారు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. విశ్వాస పరీక్షలో 81 మంది సభ్యులు పాల్గొనగా.. సోరెన్‌కు 48 మంది సభ్యులు మద్దతు తెలిపారు. కాగా విశ్వాస పరీక్ష సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది భాజపా. విశ్వాస పరీక్షలో నెగ్గిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యంత్రి హేమంత్ సోరెన్.. భాజపా తీరుపై నిప్పులు చెరిగారు. ఝార్ఖండ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. కమలం పార్టీ చేసిన చర్యల కారణంగానే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. అధికార కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి.. ప్రతిపక్ష భాజపా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని సోరెన్ ఆరోపించారు. అయినప్పటికీ సభలో తమ బలాన్ని నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్లో ప్రజలు వస్తువులను కొనుగోలు చేస్తారని.. భాజపా మాత్రం శాసన సభ్యులను కొనుగోలు చేస్తుందని ఆక్షేపించారు.
గనుల లీజును తనకు తానే కేటాయించుకుని.. సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న భాజపా ఆరోపించింది. దీంతో సోరెన్‌పై ఎమ్మేల్యేగా అనర్హత వేటువేయడంపై గవర్నర్ అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కోరినట్లు విస్తృతంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికార యూపీఏ కూటమి విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. అయితే అనర్హతపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఝార్ఖండ్ అసెంబ్లీలో మెుత్తం సభ్యుల సంఖ్య 81 కాగా.. మెజారిటీ సాధించేందుకు 42 సభ్యుల మద్దతు అవసరం.
ఇవీ చదవండి: బెంగళూరును ముంచెత్తిన వరద.. ఐటీ కంపెనీలకు ఇబ్బందులు.. స్పందించిన సీఎం