JDU President Lalan Singh Resign Rumours : సార్వత్రిక ఎన్నికల మందు జేడీయూకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు సన్నిహితుడు, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ ఆ పదవి నుంచి వైదొలగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారం చివర్లో జరిగే జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో లలన్ సింగ్ రాజీనామా ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో నీతీశ్ కుమార్‌కు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న క్రమంలోనే లలన్‌కు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
రెండేళ్లకు పైగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న లలన్ సింగ్ ఆ పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు జేడీయూ సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ఆయన తన ముంగేర్ లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకోవడంపైనే దృష్టిసారించినట్లు లలన్ సింగ్ చెప్పడంపై సీఎం నీతీశ్ కుమార్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ అధ్యక్షుడిగా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ తన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని లలన్‌కు సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. గత వారంలో లలన్ సింగ్ నివాసానికి వచ్చిన నీతీశ్ మధ్య ఈ చర్చే నడిచినట్లు సమాచారం.
అయితే, ఈ వార్తలను కొట్టిపారేశారు బిహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరీ. తమ పార్టీలో చీలికల కోసం అంతా చూస్తున్నారని, కానీ తమలో చిన్న విభేదాలు కూడా లేవని ఆయన చెప్పారు. డిసెంబర్ 29న జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చించనున్నట్లు తెలిపారు. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన మండిపడ్డారు. సుశీల్ ఎప్పుడూ జేడీయూ గురించే మాట్లాడుతారని, ఎందకంటే సొంత పార్టీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోరని చెప్పారు.
ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: నీతీశ్
మరోవైపు విపక్ష కూటమి ఇండియాకు ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేరును కొందరు ప్రతిపాదించడంపై తనకెలాంటి అభ్యంతరం లేదని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ చెప్పారు. ప్రధాన మంత్రి అభ్యర్థిత్వంపై తనకెలాంటి ఆసక్తి లేదని మొదట్లోనే చెప్పానని పేర్కొన్నారు. ఖర్గేను ప్రధాని పదవికి సూచించడంపై తనకు కోపం రాలేదని, ఏమాత్రం నిరాశ చెందలేదని వివరించారు. సీట్ల సర్దుబాటును త్వరగా పూర్తి చేయాలని భాగస్వామ్య పక్షాలను కోరినట్లు వెల్లడించారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టడమే తన లక్ష్యమని నీతీశ్ చెప్పారు. తమ కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. తాము కలిసే పనిచేస్తున్నామని, పార్టీలో అంతా బాగానే ఉందని నీతీశ్ చెప్పారు.
'NCPలానే జేడీయూ కూడా చీలుతుంది'.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమి జోరు తగ్గింది : నీతీశ్ కుమార్