Janaki Mahal Ayodhya: అయోధ్యలో మరికొద్ది రోజుల్లో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరగనుంది. అయితే అయోధ్యలో రామమందిరం కాకుండా 'జానకి మహల్ ఆలయం' కూడా ఉంది. ఈ మందిరంలో భక్తులు శ్రీ రాముడిని అల్లుడిగా భావిస్తారు.
భారత్‌లో అల్లుడిని ఎంతో ప్రత్యేకంగా, గౌరవంగా చూసుకుంటారు. అదే సంప్రదాయాన్ని జానకి మహల్ ఆలయాంలోనూ అనుసరిస్తూ భక్తులు ప్రతిరోజు రామయ్యను స్మరిస్తూ భజనలు చేస్తారు.
"శ్రీ రాముడ్ని మిథిలా నగరానికి అల్లుడిగా భావించే మేం ఆయనకు రోజూ సేవ చేసుకుంటాం. కీర్తనలు, భజనలతో ఆయన్ను సంతోషపరుస్తాం."
--రాఘవేంద్ర వ్యాస్, భక్తుడు
"శ్రీ మోహన్ లాల్ జానకి మహల్‌ను మిథిలా ధామ్‌గా మార్చారు. అప్పటినుంచి ఈ మిథిలలో శ్రీ రాముడు పూజలందుకుంటున్నాడు."
--ప్రసాద్ మిశ్రా, భక్తుడు
ఈ మందిరం ఉన్న ప్రాంతం ఒకప్పుడు నేపాల్‌లోని ఓ రాజ కుటుంబీకులకు చెందినది. 1942లో మోహన్‌లాల్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, ఈ ప్రాంతాన్ని సీతాదేవి పుట్టింటిగా మార్చారు. అయితే సీతాదేవి నేపాల్‌లో జన్మించిందని ప్రజలు నమ్ముతారు.
"ఓ వ్యక్తి తన అత్తారింటికి వెళ్లినప్పుడు ఎలాగైతే గౌరవ మర్యాదలు పొందుతాడో, ఈ మందిరంలో శ్రీ రాముడిని కూడా అలాగే కొలుస్తాం. ఆయన్ను ఉదయం నుంచి రాత్రి వరకు జాగ్రత్తగా చూసుకుంటాం. రోజుకు ఎనిమిదిసార్లు రాముడికి హారతి ఇస్తాం."
--ఆదిత్య సుల్తాని, జానకి ట్రస్టు మెంబర్
ప్రతి ఏడాది పుష్యమాసంలో జరిగే సీతారాముల కల్యాణం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ సమయంలో సీతారాముల దర్శనానికి భక్తులు అధికంగా వస్తారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఈ ఆలయం భక్తులకు ఆశ్రయం కల్పించింది.
"1988- 92 ఉద్యమ సమయంలో జానకి ట్రస్టు కేంద్ర బిందువుగా నిలిచింది. చివరి వరకు ఉద్యమానికి ఈ ట్రస్టు మద్దతుగా నిలిచింది. ఆ సమయంలో అనేక మంది బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నాయకులు ఇక్కడకు వచ్చారు"
--నరేశ్ కుమార్, ట్రస్టు అధికారి
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చే భక్తులు, సాధువులు బస చేసేందుకు జానకి ట్రస్టు విశేష ఏర్పాట్లు చేస్తోంది.
ఒకటిన్నర టన్నుల బరువుతో అయోధ్య రాముడి విగ్రహం- ఆ శిల్పిదే ఫైనల్!
రామమందిర నిర్మాణం గురించి 33ఏళ్ల కిందటే చెప్పిన బాబా! మాజీ ప్రధానులూ ఆయన భక్తులే!!