మెహందీ అనగానే అందరూ చేతులకు పెట్టుకునే ఓ అలంకరణగా భావిస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం మెహందీతో రికార్డులు సాధించింది. ఓ వైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే.. మరోవైపు తన అభిరుచికి నచ్చినట్లుగా వస్త్రాలపై మెహందీని వేసి రికార్డును సొంతం చేసుకుంది. ఇలా ఆరు గంటల్లోనే ఆరు మీటర్ల పొడవైన వస్త్రంపై సీతారాముల బొమ్మను వేసి రికార్డు సృష్టించింది. ఫలితంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌కు చెందిన అనుశ్రీ విశ్వకర్మ హైదరాబాద్‌లో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమె తల్లి క్రాఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తుండడం వల్ల అనుశ్రీకి చిన్ననాటి నుంచి వాటిపై ఆసక్తి ఎక్కువ. కానీ ఇంటికి దూరంగా పనిచేస్తుండడం వల్ల కళలకు సమయం కేటాయించేందుకు వీలు ఉండేది కాదు. కొవిడ్ పరిమాణాల నేపథ్యంలో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది అనుశ్రీ. దీంతో ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాల్లో తన అభిరుచికి తగ్గట్లుగా ఏదైనా సాధించాలని అనుకుంది. ఇందుకోసం మెహందీతో ప్రత్యేకమైన డిజైన్లు వేయాలని భావించింది. ఇప్పటివరకు నమోదైన అనేక రికార్డులను పరిశీలించింది అనుశ్రీ. ఇందులో అంతకుముందు కేరళకు చెందిన ఓ మహిళ రికార్డు అనుశ్రీ దృష్టిని ఆకర్షించింది. ఆమె నాలుగు మీటర్ల పొడవైన వస్త్రంపై మెహందీ డిజైన్ వేసింది. ఆ రికార్డును తిరగరాయాలని భావించిన అనుశ్రీ.. తన నైపుణ్యాలను పదును పెట్టింది.
"మా అమ్మ నుంచి నాకు ఈ ప్రేరణ లభించింది. ఆమె గత 30 సంవత్సరాలుగా క్రాఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తోంది. మొదట నేను బయట ఉండేదాన్ని. కొవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాను. ఈ సమయంలోనే ఏదైనా ప్రత్యేకంగా చేసి ఓ రికార్డు సాధించాలని అనుకున్నాను. అందుకోసం అంతకుముందు ఉన్న అనేక రికార్డులను పరిశీలించాను. మా రాష్ట్రం నుంచి ఒక్క రికార్డు కూడా లేదు. దీంతో నేను ఎందుకు రికార్డు సృష్టించకూడదు అనుకుని సాధించాను."
--అనుశ్రీ విశ్వకర్మ, రికార్డు సాధించిన యువతి
రికార్డు కోసం తన నైపుణ్యాలను పదును పెట్టుకున్న అనుశ్రీ.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థను సంప్రదించింది. అనంతరం వారు పంపించిన ప్రతినిధి ముందు ఆరు గంటల్లోనే ఆరు మీటర్ల పొడవైన వస్త్రంపై సీతారాముల బొమ్మను వేసింది. 19 అడుగుల 6 అంగుళాల పొడవు, 1 అడుగు 8 అంగుళాల వెడల్పు గల వస్త్రంపై ఆరు గంటల్లోనే మెహందీతో సీతారాముల డిజైన్ వేసి రికార్డు సృష్టించిందని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి తెలిపారు. ఈ రికార్డును ధ్రువీకరిస్తూ 2023 మార్చి 30న పత్రాన్ని అందజేసింది ఆ సంస్థ.
ఇవీ చదవండి : వంతెన పైనుంచి నదిలో పడిన బస్సు.. 15 మంది మృతి
'వారంతా కచ్చితంగా JIO సిమ్ వాడాల్సిందే'.. ప్రభుత్వం కీలక ఆదేశాలు