జమ్ముకశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 43 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. పుంఛ్ జిల్లాలో అత్యధికంగా 83.07 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుల్వామాలో కనిష్ఠంగా 9 శాతం ఓటింగ్ నమోదైంది.
మూడో దశలో భాగంగా 33 డివిజన్లలో ఓటింగ్ జరిగింది. మొత్తం 2046 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 7 లక్షల 37 వేల 648 మంది ఓటర్లు ఉన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 28న ప్రారంభం కాగా డిసెంబర్ 19న తుది దశ, 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఉదయం నుంచే..
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. కొవిడ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేశారు.
అభ్యర్థిపై ముష్కరుల కాల్పులు..
జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీకి చెందిన అభ్యర్థి అనీస్ అహ్మద్‌పై.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంత్‌నాగ్ జిల్లా సంగమ్లోని ఆయన నివాసం సమీపంలో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన అనీస్‌ను ఆస్పత్రికి తరలించారు.