ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఇండో- టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ), సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చమోలీ జిల్లాలోని తపోవన్ డ్యామ్‌లో చిక్కుకున్న 16 మందిని ఐటీబీపీ కాపాడింది.
సైన్యం సహాయక చర్యలు
ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యల కోసం మూడు కంపెనీల ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రెండు సూపర్ హెర్క్యులస్ విమానాలను పంపించారు అధికారులు. వారితో పాటు 15 టన్నుల సహాయక పరికరాలను ఘజియాబాద్ హిందాన్ ఎయిర్‌బేస్ నుంచి పంపించారు. సైన్యం పరంగా సహాయకచర్యలను త్రిదళాధిపతి బిపిన్ రావత్ పర్యవేక్షిస్తున్నారు.
రూ.6 లక్షల ఆర్థిక సాయం
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని మృతి చెందిన వారికి ఆర్థిక భరోసా కింద రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. ప్రధాని సహాయ నిధి కింద మరో రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది.
ముప్పు లేదు..
రిషిగంగా హైడ్రో ప్రాజెక్టు దిగువ ప్రాంత గ్రామాలకు ఎలాంటి ప్రమాదకరమైన వరద ముప్పు పొంచిలేదని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) స్పష్టం చేసింది.