కేరళలోని ఎల్డీఎఫ్ సర్కారుపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు. ఇది వింటుంటే తనకే సిగ్గుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌కు అడ్డాగా ఉన్న పంజాబ్‌ను త్వరలోనే కేరళ దాటేయబోతోందని వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా పినరయి విజయన్ సర్కారు, గవర్నర్‌కు మధ్య ఘర్షణాపూరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గవర్నర్ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అన్ని చోట్లా మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్నే ఓ ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు.
'నూరు శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి సిగ్గుచేటు. రాష్ట్రంలో మద్యం, లాటరీని ప్రధాన ఆదాయ వనరులుగా చూస్తున్నారు. ఇలాంటి రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనందుకు నాకు సిగ్గుగా అనిపిస్తోంది. అసలు ఈ లాటరీలేంటి? పేద ప్రజలు లాటరీ టికెట్లు కొంటే ఇక్కడ కూర్చుని మీరు డబ్బులు లెక్క పెట్టుకుంటారా? లాటరీ పేరు చెప్పి ప్రజల్ని దోచుకుంటున్నారు. ప్రజల్ని మద్యానికి బానిసలుగా చేస్తున్నారు' అంటూ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్య పానానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన చోట.. మద్యం తాగాలని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి:
'భాజపాతో సంబంధం లేకపోతే మరి ఇదేంటి'.. నీతీశ్‌పై పీకే సెటైర్