International Mens Day 2023 Date and Significance: అతని కళ్లలో ఆవేశమే అందరికీ కనిపిస్తుంది, కానీ.. మనసు పొరల్లోని మమతల తడి తెరచి చూస్తే కానీ తెలీదు. గాంభీర్యాన్ని మాత్రమే అతడి ముఖంలో గమనిస్తారు అందరూ.. గుండె లోతుల్లోని ప్రేమానురాగాలు ఆరా తీస్తేకానీ అర్థం కావు.. అతడి మాట కటువు.. అది క్రమశిక్షణ కోసమే. ప్రవర్తన గరుకు.. అది పరివర్తన కోసమే. ప్రతి దానికీ సరిహద్దులు గీస్తాడు.. సురక్షితమైన హద్దులు దాటకూడదనే. తనవారి క్షేమమే.. అతడి అంతిమ లక్ష్యం. భార్యను కంటికి రెప్పలా కాపాడుతాడు.. అక్కాచెల్లికి అంతులేని ఆప్యాయత పంచుతాడు.. తాను కన్నవారికి ఆకాశాన్ని అందించే నిచ్చెన అవుతాడు.. తనను కన్నవారికి కొండంత అండగా నిలబడతాడు.. ఇంతకీ ఎవరతను..? అతడే "పురుషుడు". ఇవాళ వరల్డ్ మెన్స్ డే. ఈ సందర్భంగా.. ప్రతి ఇంట్లోనూ మగాళ్లు చేసే సేవలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.
అందరూ నవ మాసాలు మోసే తల్లిగురించే మాట్లాడుతారుగానీ.. జీవితాంతం గుండెల్లో మోసే తండ్రి గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడరు. అచ్చం ఇదేవిధంగా.. అందరూ మహిళల గురించి మాట్లాడుతారుగానీ.. పురుషుల త్యాగాల గురించి ఎవ్వరూ పట్టించుకోరు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ క్రమంలో పుట్టిందే.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.
ఎప్పుడు మొదలైంది?
Missouri University Professor Thomas: అమెరికా కన్సాస్‌లోని మిస్సోరి యూనివర్శిటీ ప్రొఫెసర్ థామస్, సమాజానికి మగవాళ్లు చేస్తున్న సేవల్ని అభినందించేందుకు ఒక రోజు అవసరం అని భావించారు. అలా.. ఆయన ఆధ్వర్యంలోనే మొట్టమొదటిసారిగా 1992, ఫిబ్రవరి 7న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరిగింది. దక్షిణ యూరప్‌కి చెందిన మాల్టా దీవి మాత్రం ఈ ఉత్సవాల్ని 1994 నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తోంది.
మరి.. ఫిబ్రవరి 7 నుంచి నవంబర్ 19కి మెన్స్ డే ఎలా మారింది అనే అనుమానం మీకు రావచ్చు. ఇందుకు కారణం.. ట్రినిడాడ్-టొబాగోకు చెందిన డాక్టర్ జెరోమో తిలక్‌సింగ్. 1999లో అక్రమంగా జైలు పాలైన మగవాళ్ల కోసం ఆయన అక్కడ ఉద్యమించారు. మగవాళ్ల సమస్యలతోపాటు హక్కుల గురించి కూడా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఆ తిలక్ సింగ్ తండ్రి పుట్టినరోజు నవంబర్ 19. అదే రోజు ట్రినిడాడ్ టొబాగో టీమ్ వరల్డ్ కప్ సాకర్ టోర్నీకి ఎంపికైంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని నవంబర్ 19ని మగవాళ్ల రోజుగా నిర్వహించారు.
"ఐక్యరాజ్య సమితి" ఆమోదం..
1999లో ఐక్యరాజ్య సమితి అదే రోజున ‘మెన్స్ డే’ నిర్వహించుకునేందుకు ఆమోదం తెలిపింది. దాదాపు 80కి పైగా దేశాలు ఇప్పుడు మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. ఆ లిస్ట్‌లో మన దేశం కూడా ఉంది. యునెస్కో సహకారంతో కొన్ని దేశాల్లోని ఎన్జీవోలు, మరికొన్ని దేశాల్లో ప్రభుత్వాలే అధికారికంగా మెన్స్ డేను నిర్వహిస్తున్నాయి. ఈ రోజున.. మగవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిళ్లు, ఆరోగ్యం, ఇతర సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. అన్నింటికీ మించి.. "ఈ సమాజంలో మగాళ్లంతా దుర్మార్గులు.." అంటూ కొందరిలో పేరుకుపోయిన భావనను తుడిచిపెట్టే ఓ ప్రయత్నంగా ఈ రోజును నిర్వహిస్తున్నారు.
International Men Day 2023 Theme: 2001 నుంచి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఒక్కో ఏడాదికి.. ఒక్కో నేపథ్యంతో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది "జీరో మేల్ సూసైడ్" థీమ్‌ను ప్రకటించారు. జీవితంలో సమస్యలు, సవాళ్లను తట్టుకోలేక ఎంతో మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి బలవన్మరణాలను ఆపాలన్నదే ఈ థీమ్ ఉద్దేశం. యువకులు, పురుషుల్లో మానసిక ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడం లక్ష్యం. మన ఇంట్లో కూడా.. తండ్రిగా, భర్తగా, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా.. మగాళ్లు ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. అలాంటి వారి సేవలను గుర్తించి.. వారికి అండగా నిలవాల్సిన అవసరం అందరికీ ఉంది.