ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్(Integrated Theatre Command).. దేశంలోని త్రివిధ దళాల వనరులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తలపెట్టిన అతిపెద్ద సంస్కరణ ఇది. దీనికి ఓ రూపాన్ని ఇచ్చేందుకు ఆర్మీ, నేవీ, వాయు సేనల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ సంస్కరణకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. థియేటర్ కమాండ్‌లోని పలు ప్రతిపాదనలపై భారత వాయుసేన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇది పరిష్కరించగలిగే సమస్యే అయినప్పటికీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇందుకు కారణం త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్(CDS Bipin Rawat), ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఆర్కే భదౌరియా(RK Bhadauria) మధ్య విభేదాలు రాజుకోవడం. దీంతో థియేటర్ కమాండ్ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'సహాయక పాత్ర'పై విభేదాలు..
సింగిల్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్‌ను ఏర్పాటు చేసేందుకు ఐఏఎఫ్(IAF)కు అవకాశం ఇవ్వకూడదని సీడీఎస్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో వాయుసేనది 'సహాయక పాత్ర' అని పేర్కొన్నారు. బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఐఏఎఫ్ చీఫ్ మార్షల్(IAF chief marshal) అసహనం వ్యక్తం చేశారు. వాయుసేనది కేవలం సహాయక పాత్ర కాదని తెలిపారు.
"ఐఏఎఫ్ది సహాయక పాత్ర కాదు. దేశ రక్షణలో వాయుసేనది కీలక పాత్ర. యుద్ధ ప్రాంగణంలో వాయుసేన కేవలం సహాయం చేయదు. ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుంది. గగనతలం రక్షణకు మాత్రమే ఐఏఎఫ్ కట్టుబడి ఉండదు. భూమి మీద భద్రతా దళాలు ఆపరేషన్ చేపడితే, గగనతలంలో వాయుసేన సహాయం అందిస్తుంది. శత్రువు భూభాగంలోకి ప్రవేశిస్తే, వారి రక్షణకు ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటుకు మా మద్దతుటుంది. కానీ అది సాధ్యపడటానికి క్లిష్టంగా ఉంది. దానిని ఎలా సాధించాలనేది అసలైన సమస్య. ఈ విషయాన్ని అంతర్గత చర్చల్లో లేవనెత్తాము. ఏం చేసినా సరిగ్గా చేయాలి. ఇది అత్యంత కీలకమైన సంస్కరణ."
--- ఆర్కేఎస్ భదౌరియా, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్
ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటే ఏంటి?
సీడీఎస్ ఆధ్వర్యంలో దేశ మిలిటరీలో సంస్కరణలు, ఆధునికీకరణ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రస్తుత లక్ష్యం. సైన్యం, నేవీ, వాయు దళాలకు సంబంధించిన వనరులు(ఆస్తులు, సిబ్బంది, పరికరాలు) ఒక్క చోట చేర్చడమే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్. అంటే వేరువేరుగా కాకుండా.. ఒక్క కమాండరే ఇవన్నీ చూసుకుంటారు. ఆపత్కాలంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఏ దేశంలో ఎలా?
చైనా, అమెరికాలు ఈ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ వ్యవస్థను పాటిస్తున్నాయి. 2015లో చైనా తన మిలిటరీని థియేటర్ కమాండ్ కిందకి చేర్చి.. దేశంలోని 7 మిలిటరీ ప్రాంతాలను భౌగోళికంగా 5 థియేటర్ కమాండ్లుగా మార్చింది. మరోవైపు అమెరికాకు 6 థియేటర్ కమాండ్లు ఉన్నాయి.
అయితే భౌగోళికం, కార్యచరణ అవసరాల మేరకు భారత్‌లో ప్రస్తుతం 17 కమాండ్లు ఉన్నాయి. అవి.. 6 ఆర్మీ కమాండ్లు, 1 శిక్షణా కమాండ్, మూడు నేవీ కమాడ్లు, 5 ఐఏఎఫ్ కమాండ్లు, ఒక శిక్షణ కమాండు, ఒక నిర్వహణ కమాండ్.
-- సంజీవ్ కే బారువా, సీనియర్ పాత్రికేయులు.
ఇదీ చూడండి:- 'భారత సైన్యం సత్తా ఏంటో చైనాకు అర్థమైంది'