గోవా పేరు గుర్తొస్తే చాలు.. ఎన్నో అద్భుతమైన పర్యటక ప్రదేశాలు కళ్లముందు మెదులుతాయి. ఇక 'ఆల్కహాల్ ప్రియుల'కు గోవా ఇచ్చే కిక్కే వేరు. అలాంటి గోవాలో కొలువుదీరిన.. దేశంలోనే తొలి 'ఆల్కహాల్ మ్యూజియం' ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది(alcohol museum goa location). ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లో ఏర్పాటు చేసిన ఈ 'ఆల్ అబౌట్ ఆల్కహాల్' మ్యూజియంలో.. ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి.
గోవాలో ఎన్నో మద్యం రకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో 'ఫేని' ఎంతో ప్రసిద్ధి చెందింది. అక్కడకు వెళ్లే ఆల్కహాల్ ప్రియులు ఫేని రుచి చూసేందుకు తహతహలాడతారు. అంతటి క్రేజ్ ఉన్న ఫేని విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేందుకే ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకుడు, స్థానిక వ్యాపారవేత్త నందన్ తెలిపారు(alcohol museum goa ).
"ఈ ఆలోచన నాకు వచ్చినప్పుడు.. అసలు ప్రపంచంలో ఆల్కహాల్ మ్యూజియం ఉందా? అని గూగుల్ చేశాను. ఎక్కడా లేదు. మీరు స్కాట్లాండ్కు వెళితే 'స్కాచ్' చూపించి వారు ఎంతో గర్వపడతారు. రష్యాకు వెళితే 'వోడ్కా'ను గర్వంగా చూపిస్తారు. ఇండియాకు తిరిగొస్తే.. మన ఫంక్షన్లు, పార్టీల్లో స్కాచ్ చూపించి తెగ మురిసిపోతాము. వోడ్కా చూసి గర్వపడతాము. మన దేశంలో తయారు చేసే మద్యంలో రసాయనాలు ఉండవు. కొన్నింటిని మట్టిలో నుంచి తయారు చేస్తారు. ఇంకేం కావాలి? దీనితో పాటు మరికొన్నింటిని పరిగణనలోకి తీసుకున్నాను. మద్యాన్ని ఎవరు సృష్టించారనే విషయం నాకు తెలియదు. కానీ ఆల్కహాల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసిన తొలి దేశం మాత్రం ఇండియానే."
--నందన్ కుద్చద్కర్, మ్యూజియం నిర్వాహకుడు.
నందన్‌కు పురాతన వస్తువులు సేకరించడం, వాటి గురించి సమాచారం తెలుసుకోవడం ఎంతో ఇష్టం. అందుకు తగ్గట్టుగానే ఆయన ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. పాత కాలంలో మద్యం కోసం ఉపయోగించిన సీసాల నుంచి ఇప్పుడు వినియోగిస్తున్న గ్లాసుల వరకు అన్నీ మ్యూజియంలో ఉన్నాయి. మద్యం తయారీ విధానాలు, వాటి కోసం కావాల్సిన వ్యవస్థలను ఇక్కడ పొందుపరిచారు(alcohol museum candolim).
మ్యూజియంలో కాజు ఫేనిని సహజసిద్ధంగా తయారు చేసి సందర్శకులకు ఇస్తున్నారు. మొత్తం మీద పర్యటకులు మంచి అనుభూతి పొందినట్టు చెబుతున్నారు. మ్యూజియం నుంచి ఎంతో నేర్చుకున్నామని అంటున్నారు.
"నేను మల్హోత్రా. రోడ్డు మీద వెళుతున్నప్పుడు నాకు ఈ మ్యూజియం కనిపించింది. లోపలకు వచ్చి చూస్తే, నాకు ఎంతో సమాచారం తెలిసింది. మ్యూజియం టూర్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మద్యం తయారీ విధానాల్లో వివరించిన పద్ధతులు నాకు ముందు తెలియవు. గోవా 'ఆల్కహాల్ క్యాపిటల్'. దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తారు. గోవాలో ఇలాంటిది ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఇక్కడి సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలు నాకు చాలా నచ్చాయి."
-- డా. మల్హోత్రా, పర్యటకుడు.
సామాజిక మాధ్యమాల ద్వారా ఈ మ్యూజియానికి మంచి పేరు వచ్చింది. దీంతో గోవా వెళుతున్న పర్యటకులు.. మ్యూజియాన్ని కచ్చితంగా సందర్శించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం పర్యటకులు ఉచితంగానే మ్యూజియాన్ని సందర్శించుకునే వెసులుబాటు కల్పించారు నిర్వాహకులు. రానున్న నెలల్లో ఎంట్రీ ఫీ తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఇదీ చూడండి:- ఎలక్ట్రీషియన్ వింత ప్రవర్తన- ట్రాన్స్ఫార్మర్కు మద్యంతో అభిషేకం