కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత దాడులు చేస్తోంది. భారత సైనిక వర్గాలు ఈమేరకు వెల్లడించినట్టు చెబుతూ పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రచురించింది.
ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌తో పాటు విదేశీ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా భారత సైన్యం దాడులు చేస్తోందని స్పష్టం చేసింది. ఇలాంటి దాడుల్లో వాటిల్లే నష్టం చాలా స్వల్పమని వివరించింది.
"ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరుగుతోన్న నేపథ్యంలో ఆ దేశం విభిన్న పంథా ఎంచుకుంది. కశ్మీర్ యువకులకు ఆయుధాలను ఇచ్చి అనిశ్చితి సృష్టించాలని భావిస్తోంది. కొన్ని వారాలుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. సామాన్యులే లక్ష్యంగా దాడులు చేస్తోందని వెల్లడించాయి" అని సైనిక వర్గాలు చెప్పినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది.
తోసిపుచ్చిన సైన్యం..
అయితే లక్షిత దాడులు జరిగాయని భారత సైన్యం నిర్ధరించలేదు. 13వ తేదీన జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలను విశ్లేషిస్తూ పీటీఐ ఈ కథనం ప్రచురించిందని తెలిపింది. నేడు నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి కాల్పులు జరగలేదని స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: అమరుడైన 18 ఏళ్లకు ఆ జవాన్ భార్యకు పరిహారం!