India Alliance Cracks : కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన-యూబీటీ, ఎన్సీపీల మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే ఇదే తరహా సమస్య బంగాల్‌లోనూ కనిపిస్తోంది. తృణమూల్‌తో పొత్తు అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్‌కు ఉందంటూ ఆ రాష్ట్ర PCC అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలనుకోవడం లేదని, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకే ఆమెకు సమయం సరిపోతోందంటూ అధీర్ రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రాతిపాదించారని, ఆమె దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదన్నారు. సీట్ల పంపిణీ విషయంలో మమతా బెనర్జీని ఎవరు విశ్వసిస్తారని అధీర్ వ్యాఖ్యానించారు. పొత్తుల్లో భాగంగా బంగాల్లోని మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో 2 స్థానాలు కాంగ్రెస్‌కు ఇవ్వాలని అధికార తృణమూల్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రతిపాదన నచ్చనందునే అధీర్ ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
"మమతా బెనర్జీ అసలు రూపం బయటపడింది. బంగాల్లో రెండు సీట్లు ఇస్తామని వారు (టీఎంసీ) అంటున్నారు. ఆ రెండు సీట్లను బీజేపీ, టీఎంసీని ఓడించి మేం గెలుచుకున్నాం. ఆ రెండు సీట్లు ఇచ్చి మాకు మేలు చేస్తున్నామని అనుకుంటున్నారా? గెలవడానికి మాకు మమత అవసరం లేదు. ఆమెకే కాంగ్రెస్ అవసరం. ఒంటరిగా పోటీ చేసి గతంలో కంటే అధిక స్థానాలు గెలిచే సత్తా మాకు ఉంది. దానికి మేం సిద్ధంగా కూడా ఉన్నాం. మమత దయ అవసరం లేదు. ఆ రెండు స్థానాల్లో టీఎంసీ పోటీ చేసినా మేమే గెలుస్తాం."
-అధీర్ రంజన్ చౌధరి, బంగాల్ పీసీసీ చీఫ్
'ఒంటరి పోరుతో గెలిచింది మేమే'
ఎన్నికల్లో గెలిచేందుకు తమకు కాంగ్రెస్ అవసరం లేదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ పేర్కొన్నారు. అధీర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. 'ఇండియా కూటమిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌కు టీఎంసీ మద్దతిస్తోంది. సీట్లపై మమతా బెనర్జీ తుది నిర్ణయం తీసుకుంటారు. మమతా బెనర్జీ రెండు సీట్లు ఆఫర్ చేస్తే తమకు 8 కావాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. అసెంబ్లీలో 294 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో మీరు ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేకపోయారు మరి?' అని విమర్శించారు కునాల్ ఘోష్.
'3రాష్ట్రాల్లో ఓటమి- అయినా తగ్గేదేలే- సీట్ల సంఖ్యలోనే తేడా, ఓట్లలో కాదు!'
'ఇండియా' కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ బ్లూప్రింట్! అన్ని రాష్ట్రాల నేతలతో కమిటీ భేటీ