బంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తపన్ దాస్‌గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఓటెయ్యకపోతే విద్యుత్తు, మంచినీటి సరఫరాకు నోచుకోరని ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. సప్తగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దాస్‌గుప్తా శనివారం హుగ్లీలో ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తనకు ఓటేయని ఆయా ప్రాంతాల వారికి విద్యుత్తు, మంచినీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. వాటికోసం మీరు భాజపానే అడగాలని సూచించారు.
టీఎంసీకి చెందిన ఓ ఎమ్మెల్యే సైతం గతంలో ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే హమీదుల్ రెహ్మాన్ దినాజ్‌పుర్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ తనకు ఓటేయని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం అందించిన ప్రయోజనాలను ఆస్వాదించి.. పార్టీకి ఓటేయకుండా ద్రోహం చేస్తే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీకే ఓటేయాలన్నారు.
ఇదీ చూడండి: 'బంగారు బంగాల్' కల నెరవేరబోతోంది: మోదీ