కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తొలి 30 నిమిషాలే అత్యంత కీలకమని, ఏవైనా ప్రమాదకర లేదా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే అవి ఆ సమయంలోనే కనిపిస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అందుకే టీకా తీసుకున్న వారిని అరగంట పాటు పరిశీలనలో ఉంచుతున్నామని స్పష్టంచేసింది. కరోనా వ్యాక్సిన్‌లపై అసత్య ప్రచారాలు, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖతో కలిపి యునిసెఫ్ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, సీనియర్ అధికారి వీణా ధావన్ టీకాలకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డోర్-టు-డోర్ వ్యాక్సినేషన్ సాధ్యం కాకపోవడానికి గల కారణాలను వివరించారు. వర్క్‌షాప్‌లో చర్చించిన వివరాలివీ..
- సమర్థమైన కంటెయిన్‌మెంట్ వ్యూహాలు, కొవిడ్ నిబంధనలు పాటించడం వల్ల ఒకవేళ థర్డ్‌వేవ్ వచ్చినా ఆరోగ్య వ్యవస్థపై అంతగా ఒత్తిడి చూపదని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
- దేశ జనాభాలో ఇప్పటివరకు కేవలం 2.2 శాతం మందిలో మాత్రమే వైరస్ బయటపడింది. మరో 97 శాతం ప్రజలకు వైరస్ ముప్పు పొంచివున్నట్లే.
- కరోనా వ్యాక్సిన్లపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు, అసత్య ప్రచారాల వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలు టీకా తీసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు.
- కాక్‌టెయిల్ వ్యాక్సిన్లపై స్పందించిన ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి వీణా ధావన్.. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, రుజువుల ప్రకారం, వ్యాక్సిన్లను మార్చకూడదని స్పష్టం చేశారు. రెండు డోసుల్లోనూ ఒకే టీకా తీసుకోవాలని సూచించారు.
- వ్యాక్సిన్లు దాదాపు 6 నుంచి 9 నెలల పాటు రక్షణ కల్పిస్తాయని అంచనా వేస్తున్నట్లు లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఒక వేళ ఇది నిజమని తేలితే బూస్టర్ డోసులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
- వ్యాక్సిన్ తీసుకున్నాక ఏవైనా దుష్ప్రభావాలు (AEFI) ఉంటే.. అవి తొలి 30నిమిషాల్లోనే కనిపిస్తాయని ఆరోగ్యశాఖ అధికారి వీణా ధావన్ పేర్కొన్నారు.
- గర్భిణులకు వ్యాక్సిన్ ఇవ్వవచ్చని వ్యాక్సినేషన్‌పై ఎక్స్‌పర్ట్ గ్రూప్ (NTAGI) సిఫార్సు చేసింది. ఇందుకు అనుగుణంగా గర్భిణులకు టీకాల పంపిణీ సజావుగా సాగుతోంది.
- ఇంటింటికీ టీకా ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నందునే ఆ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. ఎందుకంటే, ఒక వ్యాక్సిన్ వయల్ తెరిచాక నాలుగు గంటల్లో అన్ని డోసులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులు లేనట్లయితే డోసులు వృథా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నివాస సముదాయాలకు సమీపంలోనే వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను చేపట్టామని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : కరోనా వైరస్‌పై 'కొవాగ్జిన్' 77.8శాతం ప్రభావవంతం