రాజకీయ అరంగేట్రంపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో భేటీ అనంతరం ఈ మేరకు వెల్లడించారు. పోయెస్ గార్డెన్‌లోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు రజనీకాంత్.
ఈ రోజు సమావేశంలో జిల్లా కార్యదర్శులు, నేను మా అభిప్రాయాలను పంచుకున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా నాతోనే ఉంటానని వాళ్లు అన్నారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటాను.
- రజనీకాంత్, దిగ్గజ నటుడు
ఇదే సరైన సమయం..
2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తలైవా రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయమని మక్కళ్ మండ్రం కార్యదర్శులు సమావేశంలో తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై వారితో రజనీ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.
ఈ భేటీ నేపథ్యంలో రజనీకాంత్ నివాసం ఎదుట అభిమానుల పోటెత్తారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రజనీ పార్టీ నిర్వాహకులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయాల్లోకి వచ్చే విషయమై డిసెంబరు 12న ఆయన పుట్టినరోజు నాడు కీలక ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. అందుకోసమే తాజా సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అయితే రజనీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ మూడేళ్ల క్రితమే ప్రకటించినా.. ఇప్పటివరకు పార్టీ ప్రారంభించలేదు. అటు క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే అదే సమయంలో మక్కళ్ మండ్రం బలోపేతానికి చర్యలు చేపట్టారు. జిల్లాలవారీగా నిర్వాహకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.