ఉత్తర్ప్రదేశ్లో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. అలీగఢ్ జిల్లాలో బుధవారం రాత్రి కొందరు ఇటుక బట్టీ కార్మికులు కల్తీ మద్యం సేవించిన ఘటనలో ఐదుగురు మరణించారు.
రోహెరా గ్రామ సమీపంలోని కాలువలో ఉన్న మద్యాన్ని వీరు సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ వ్యాపారులు కొందరు తమపై దాడి జరుగుతుందని భావించి తమ వద్ద ఉన్న నిల్వలను కాలువలో పారవేసినట్లు సీనియర్ ఎస్పీ కళానిధి నైతాని అనుమానం వ్యక్తం చేశారు. ఆ మద్యం తాగి కూలీలు చనిపోయారని వెల్లడించారు. గుర్తు తెలియని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
కల్తీ మద్యం సేవించి అనారోగ్యం పాలైన రోగులు రాత్రంతా ఆసుపత్రికి వస్తూనే ఉన్నారని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ హారిస్ మంజూర్ చెప్పారు.
కొద్దిరోజుల క్రితం అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో 55 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: కల్తీ మద్యం: 55కు చేరిన మృతుల సంఖ్య!