బంగాల్ శాసనసభ ఎన్నికల కోసం భాజపా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కోల్‌కతాలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు సహా వారి రక్షణ, మౌలిక రంగం అభివృద్ధి, పారిశ్రామిక, ఆరోగ్య రంగానికి సంబంధించి భాజపా పలు వరాలను ప్రకటించింది.
కుటుంబానికి ఒక ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన కమిషన్ సిఫార్సుల అమలు, 75 లక్షల రైతులు ఒక్కొక్కరికి 18వేల రూపాయల రుణ మాఫీ అమలు చేస్తామని షా తెలిపారు. ఇది కేవలం మేనిఫెస్టో మాత్రమే కాదని, బంగాల్ కోసం దేశంలోని అతిపెద్ద పార్టీ విడుదల చేసిన తీర్మాన పత్రం అని తెలిపారు. బంగాల్‌లోకి చొరబాటుదారులను అనుమతించబోమని షా స్పష్టం చేశారు. సరిహద్దు ఫెన్సింగ్‌ను బలోపేతం చేస్తామని తెలిపారు.
మేనిఫెస్టోలో భాజపా హామీలు..
- తొలి కేబినేట్ సమావేశంలోనే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై నిర్ణయం.
- 70 ఏళ్ల నుంచి బంగాల్లో ఉన్న శరణార్థులకు పౌరసత్వం. 5 ఏళ్లపాటు రూ.10,000 ఆర్థిక సాయం.
- ఉత్తర బంగాల్, జంగల్‌మహల్, సుందర్బాన్లో మూడు ఎయిమ్స్ ఆసుపత్రుల ఏర్పాటు.
- కృషక్ సురక్ష యోజన కింద భూమిలేని రైతులకు రూ.4,000 ఆర్థిక సాయం.
- ముఖ్యమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక హెల్ప్‌లైన్ ఏర్పాటు.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహణ.
- ఆయుధాల రాకెట్టు, మాదకద్రవ్యాల వ్యాపారం, భూ కబ్జా, నకిలీ కరెన్సీ, పశువుల అక్రమ రవాణా సమస్యను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ల ఏర్పాటు.