Hijab issue in karnataka: హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటకలో వారం రోజులుగా మూతపడిన ప్రీయూనివర్సిటీ డిగ్రీ కళాశాలల బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం మతపరమైన దుస్తులను కళాశాలలోనికి అనుమతించేది లేదంటూ సిబ్బంది కళాశాలల వద్ద విద్యార్థినులను అడ్డుకున్నారు.
హిజాబ్‌తోనే తమను తరగతులకు అనుమతించాలంటూ శివమొగ్గలోని సగర ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల వద్ద విద్యార్థినులు సిబ్బందితో వాదించారు. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. డీవీఎస్ కళాశాల వద్ద విద్యార్థినులను బూర్ఖా తొలగించి లోనికి రావాలని సిబ్బంది కోరారు. వారికోసం గేటు లోపల ప్రత్యేకంగా ఓ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల కంటే తమ విశ్వాసం ముఖ్యమని బూర్ఖా తొలగించే సమస్యే లేదని విద్యార్థినులు తేల్చిచెప్పారు. ఈ రోజు పరీక్ష ఉన్నప్పటికీ తమను తరగతులకు అనుమతించడం లేదని అన్నారు.
విజయపుర, బిజాపుర్, కలబుర్గి ప్రాంతాల్లోనూ బూర్ఖా ధరించి వచ్చిన విద్యార్థినులను కళాశాల యాజమాన్యాలు లోనికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కళాశాలల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కళాశాలల వద్ద ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు సెక్షన్ 144 విధించారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: పంజాబ్‌లో డేరాల మద్దతు కోసం రాజకీయ పార్టీల తహతహ